వావ్.. అమితాబ్ బచ్చన్ తెలుగు ట్వీట్

ట్విట్టర్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ హీరోల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన ముంబయిలో ఉన్నా.. ఎక్కడికి వెళ్లినా.. ప్రతి రోజూ అర్ధరాత్రి సమయాన ఆ రోజు చేసిన ముఖ్యమైన పనికి సంబంధించిన అప్ డేట్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకోవడం అలవాటు. నిన్న అర్ధరాత్రి దాటాక కూడా అలాగే ఒక అప్ డేట్ ఇచ్చారు. అది అందరికీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన తెలుగులో ట్వీట్ చేయడమే అందుకు కారణం. ఎప్పుడూ ఇంగ్లిష్‌లో లేదంటే ఎప్పుడైనా అరుదుగా హిందీలో టైప్ చేస్తుంటారు అమితాబ్. ఐతే ఆయన తాజా ట్వీట్‌ మాత్రం తెలుగులో ఉండటం విశేషం.

అమితాబ్ మంగళవారం హైదరాబాద్ చేరుకుని.. బుధవారం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర లుక్‌ను ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ దానికి ‘‘సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి’’ అంటూ కామెంట్ కూడా కూడా జోడించాడు బిగ్-బి. ఆయనకు తెలుగు టైపింగ్‌లో ఎవరు సాయం చేశారు కానీ.. ఇలా తెలుగులో మెసేజ్ పెట్టాలన్న ఆలోచన అమితాబ్‌కు రావడం విశేషమే. ఇది తెలుగు వారికి ఆయనిచ్చిన గౌరవంగా భావించాలి.

ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువు పాత్రలో కనిపించబోతున్నాడు అమితాబ్. పూర్తిగా తెల్లబడి ఉన్న పొడవాటి జుట్టు.. గుబురు గడ్డం.. పెద్ద బొట్టుతో అమితాబ్ లుక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది, దక్షిణాది నటులతో హిందీలో సినిమాలు చేశాడు కానీ.. అమితాబ్ ఓ దక్షిణాది సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవం అనుకోవాలి.