విదేశీయుడే పొగిడాడు… ‘విదేశీ’ అవసరమా?

రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా, ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు వినబడుతూనే ఉన్నాయి. అవి: దేశంలోనే నెంబర్‌ వన్‌, ప్రపంచంలోనే అద్భుతం, దేశానికే ఆదర్శం, దేశమంతా మన రాష్ట్రం వైపే చూస్తోంది, హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరం, ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటి… ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

విభజన జరిగినప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఏవో గొప్ప పనులు చేశాయని, ఏదో సాధించేశాయని అవార్డులు ఇస్తున్నారు. వీటిల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ అవార్డులుంటే, కొన్ని కార్పొరేట్‌ రంగం ఇచ్చే అవార్డులు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం సాధించారని ఈ అవార్డులు ఇస్తున్నారో అర్థం కాదు. ఈ పుస్కారాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు.

అవార్డులు ఇవ్వడం వెనక రకరకాల ప్రయోజనాలుంటాయనే విషయం తెలిసిందే. ఇక రెండు రాష్ట్రాలకు విదేశీ ప్రముఖులు, బడా పెట్టుబడిదారులు, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు అభివృద్ధిని చూసి (దేవతా వస్త్రాల మాదిరిగా వారి కళ్లకు అలా కనబడుతుంది) డంగైపోతుంటారు. ఇలా డంగైపోవడం నిజంగానా, మర్యాద కోసమా తెలియదు. రాష్ట్రాల అభివృద్ధి అంతా వచ్చినవారి కళ్లకు కనబడదు కదా.

పాలకులు చూపించే గ్రాఫిక్స్‌ వీడియోలు, ఫోటోలు, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు..వగైరా చూసేసి, వారు చెప్పిన మాయ మాటలు నమ్మేసి ప్రశంసిస్తున్నారు. మీ పథకాలు అద్భుతం. ఇలాంటివి మా రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చెబుతుంటారు. విదేశీ విశ్వవిద్యాలయాలవారు ఈ పథకాలపై పరిశోధనలు చేస్తున్నారని పాలకులు బిల్డప్‌లు ఇస్తుంటారు.

నాలుగు చినుకులు పడితే మనిగిపోయే హైదరాబాదును బాగుచేయలేని తెలంగాణ పాలకులకు పురస్కారాలు అవసరమా? అవినీతి తాటిచెట్టు ప్రమాణంలో పెరిగిపోయిన ఏపీకి అవార్డులు ఇవ్వాలా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ అన్నిరంగాల్లోనూ దేశంలోనే రెండో నిలిచి, ఆర్థిక, పర్యావరణ, పరిశుభ్రత రంగాల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందట. ఈ విజయాలకుగాను ‘ఇండియా టుడే’ తాజాగా అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు రావడం వరుసగా ఇది మూడోసారి. ఆ మీడియా సంస్థకు అంత గొప్పగా ఏం కనిపించిందో. ఏపీకీ ఇలాంటి అవార్డులే వచ్చాయి. తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఏపీ దేశానికే ఆదర్శం’ అని ప్రశంసించారు.

ఈ మంత్రికి అంత గొప్పదనం ఏం కనిపించిందో అర్థం కాదు. అవినీతిలో ఆదర్శమనే విషయం ఆయనకు తెలియదు. ఏపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలన్నీ అనుసరించాలని అన్నారు. చంద్రబాబు గొప్ప దార్శనికుడంటూ ఆకాశానికి ఎత్తేశారు. చెప్పుకుంటూపోతే ఈ పొగడ్తల కథ చాలా ఉంది. బాబుకు సింగపూరంటే ఎంత ఇష్టమో, ప్రేమో తెలిసిందే. ఆ ప్రేమ దేశపు మంత్రి ఈశ్వరన్‌ ఏపీ వచ్చారు. అమరావతి నిర్మాణంలో దాని భాగస్వామ్యం ఉంది కదా. ఆ మంత్రిగారు వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు చూసి అందరిమాదిరిగానే డంగైపోయారు. చాలా తక్కువ సమయంలో ఇంత అద్భుత భవనాలు నిర్మించారా? అంటూ ఆశ్చర్యపోయి బాబు దీక్షాదక్షతలను పొగిడారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అనేకమంది ‘సూపర్‌’ అన్నారు. ఈశ్వరన్‌ కూడా అనేశారు. కాబట్టి ఇంత అద్భుతమైన భవనాలను శాశ్వతం చేయొచ్చు కదా. పేరుకు ఇవి తాత్కాలిక భవనాలేగాని వందల కోట్లు ఖర్చు చేశారు. అయినప్పటికీ విదేశీ నిర్మాణ సంస్థలకు వేల కోట్లు ధారాదత్తం చేసి శాశ్వత భవనాలు ప్లాన్‌ చేస్తున్నారు. బాబుకు ఇష్టమైన సింగపూర్‌ మంత్రే సర్టిఫికెట్‌ ఇచ్చినప్పుడు తిరుగేముంది. ఇంత అద్భుత భవనాలు నిర్మించాక డబ్బు వృథా చేయడం అనవసరమని సలహా ఇవ్వొచ్చు కదా. కాని ప్రజాధనమంటే లెక్కలేని బాబు దృష్టిలో ఇవి పనికిరాని భవనాలే. అద్భుత రాజధానిలో ఇవి కనబడకూడదు.