నంది రగడ: వర్మ పొగిడాడా.? తెగిడాడా.?

నో డౌట్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడేళ్ళకుగాను ప్రకటించిన నంది పురస్కారాల విషయంలో వర్మ స్పందన ‘విమర్శ’లానే వుందని అనుకుంటున్నారా.? కాస్త వెనక్కి వెళదాం.. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకి సంబంధించి అందులో హీరోగా నటించిన విజయ్‌ దేవరకొండని వర్మ, పెద్ద పెద్ద స్టార్లకంటే చాలా చాలా ఎక్కువగా పోల్చి పొగిడేశాడు. ఆ లెక్కన, నంది అవార్డుల్నీ – ఆస్కార్‌ పురస్కారాలతో పోల్చి, వర్మ ‘నంది’ని పొగిడాడనే అనుకోవాలి.

‘నంది’ని మాత్రమే కాదు, ఆ నందుల్ని గెల్చుకున్న ‘లెజెండ్‌’ సినిమానీ, ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుని కూడా వర్మ పొగిడాడు తప్ప, ఎక్కడా వర్మ మాటల్లో ‘విమర్శ’ కన్పించలేదు.. అని కూడా అర్థం చేసుకోవాలేమో.! ఎందుకంటే వర్మ పొగడ్తకీ, వర్మ విమర్శకీ పెద్దగా తేడా లేకుండా పోయిందిప్పుడు. ఓ కొత్త హీరోని పట్టుకుని ఓ పెద్ద స్టార్‌తో పోల్చేయడం వర్మకి అలవాటే. అదే సమయంలో, ఆ పెద్ద స్టార్‌ని సమయానుకూలం వెటకారాలతోనూ అదే స్థాయిలో విమర్శించడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య.

ఇక, వర్మ తన ‘సరదా’ కోసం సోషల్‌ మీడియా వేదికగా ఏవో కామెంట్లు పెడితే, దానికి రియాక్షన్స్‌ కూడా గట్టిగానే వస్తున్నాయి. ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ సినిమా పోస్టర్‌లో ఓ అమ్మాయి బ్యాక్‌ పార్ట్‌ని చూపిస్తే, ఆ పోస్టర్‌లో ఆ బ్యాక్‌ పార్ట్‌ మాత్రమే వర్మకి ‘స్పెషల్‌’గా కన్పించడం.. అది వర్మ ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. సో, నంది విషయంలో వర్మ ఆస్కార్‌ని తక్కువ చేసినట్టా.? లేదూ, వర్మ ‘నంది’పై విమర్శించినట్టా.? అన్న అనుమానాలు రాకుండా వుండవు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పుణ్యమా అని టీడీపీ నేతలతో చెడామడా సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్న వర్మ, ఆ కోణంలో చూస్తే ‘పసుపు నందుల’ వ్యవహారమై వెటకారం చేశాడని కూడా అనుకోవచ్చు కదా.! తిట్టేవాళ్ళు తిట్టనీ, పొగిడేవాళ్ళు పొగడనీ.. డోన్ట్‌ కేర్‌.. ఇదీ వర్మ నైజం. వర్మ మాటల్ని ఎవరికి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చంతే.! దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ.

వర్మ ఏమన్నాడో యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం

నన్ను తిట్టినందుకు నాకేం బాధలేదు.. కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి.
-రామ్ గోపాల్ వర్మ