వైసీపీలో అక్కడ లొల్లి… ఆయనకు కావాల్సిందేంటో!

ఇప్పటికే తాము వైసీపీని వీడుతున్నట్టుగా దాదాపు ప్రకటించేశారు బీఎన్ఆర్ సోదరులు. బీఎన్ఆర్ ఇప్పుడు లేరనుకోండి. బీఎన్ఆర్ తమ్ముళ్లు అయిన గురునాథరెడ్డి, రెడ్డప్పరెడ్డిలు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. గురునాథరెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా చేశాడు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గురునాథరెడ్డి పనితీరు సరిగా లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక ముస్లిం అభ్యర్థిని ఇన్ చార్జిగా ప్రకటించాడు.

ప్రతి జిల్లాలోనూ ఒక సీటును కచ్చితంగా ముస్లింలకు ఇవ్వాలన్న నిర్ణయం మేరకు జగన్ మోహన్ రెడ్డి అనంతలో అర్బన్ నియోజకవర్గాన్ని ముస్లింలకు కేటాయించినట్టుగా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో గురునాథరెడ్డి అసహనభరితుడు అయిపోయాడు. తన సోదరులతో కలిసి వైసీపీనీ వీడుతున్నాను అనే సంకేతాలను ఇచ్చాడు. ఆ మధ్య ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదేమాటే చెప్పారు.

ఎటు పోతామో తెలీదు.. కానీ బయటకు మాత్రం పోతాం.. అన్నట్టుగా వారు మాట్లాడారు. మరి వాళ్లు వెళ్తామంటే వెళ్లండన్నట్టుగా వైసీపీ కూడా వదిలేసింది. ఇదివరకూ కూడా గురునాథరెడ్డి పలుమార్లు అసహనభరితుడు అయ్యాడు. అప్పుడు వైసీపీ వాళ్లు కన్వీన్స్ చేసుకున్నారు. ప్రతిసారీ కన్వీన్స్ చేయాలంటే కుదరదు కదా.. అందుకే వైసీపీ వారితో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా లేదు.

ఇదే సమయంలో.. గురునాథరెడ్డి టక్కున ఎగ్జిట్ అయిపోయి.. మరో పార్టీలోకి చేరడానికి కూడా ఏమీ ఆప్షన్స్ లేవు. తెలుగుదేశంలోకి చేరతామంటే చేర్చుకుంటారు.. కానీ, టికెట్ గట్రా ఏమీ ఆశించకూడదు. ఎందుకంటే అనంత అర్బన్ నుంచి చౌదరి ఉన్నాడు. సో ఈ రెడ్డికి అక్కడ ఛాన్స్ లేదు. ఇక ఏ జనసేనో అనేకీ లేకుండా పోయింది. ఆ పార్టీకి ఇంకా తాడూ బొంగరంలేదు కదా! బీజేపీ తెలుగుదేశానికి తోకగా సాగుతోంది. సీమలో, అందులోనూ అనంతలో కమల వికాసం కేవలం కల మాత్రమే. అందుకే వీరికి ఛాయిస్ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వాళ్లు రచ్చలు రేపుతున్నట్టుగా ఉన్నారు. నిన్న మిథున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గురునాథరెడ్డి అనుచరులు అలజడి రేపారు. కుర్చీలు విసిరి కొట్టి గొడవ చేశారు. ఇదీ గురునాథరెడ్డి సోదరుల గొడవ. వెనుకటికి ఇలాంటి తీరుతోనే పార్టీకి మంచి బేస్ ఉన్న నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ తీరుతో వైకాపానే వీరిని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుందేమో!