బుట్టా రేణుక ఔట్‌: వైఎస్సార్సీపీకి నష్టమెంత.?

‘ఓ ఎంపీ పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదు.. అయినా, ఆమె ఎప్పటినుంచో టీడీపీతో టచ్‌లో వున్నారు.. ఆమె పార్టీని వీడటం కాదు, పార్టీనే ఆమెను బయటకు పంపేసింది.. పార్టీలో వుంటూ, పార్టీని వెన్నుపోటు పొడిచిన అలాంటి కోవర్టులు పార్టీలో వుండడం కన్నా, బయటకు పోవడమే మంచిది..’

– ఇదీ వైఎస్సార్సీపీ తమ ఎంపీ బుట్టా రేణుక, పార్టీని వీడటంపై చేస్తున్న కామెంట్స్‌ సారాంశం.

ఇప్పటిదాకా వైఎస్సార్సీపీ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్‌ చేసేశారు. బుట్టా రేణుకతో కలిసి ముగ్గురు ఎంపీలు వైఎస్సార్సీపీని విడినట్లు లెక్క. ఇంతకు ముందే ఇద్దరు ఎంపీలు వైఎస్సార్సీపీని వీడగా, అందులో ఓ ఎంపీ, టీడీపీలో చేరకపోయినా, టీడీపీకి సన్నిహితంగా వుంటోన్న విషయం విదితమే. 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైఎస్సార్సీపీని వీడటమంటే చిన్న విషయం కాదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాన్ని భేరీజు వేసినప్పుడు ‘వైఎస్సార్సీపీ పనైపోయింది’ అని చెప్పుకోవాల్సి వుంటుంది.

‘మా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు..’ అని వైఎస్సార్సీపీ చెప్పుకోవచ్చుగాక. అమ్ముడుపోయారంటూ అభాండాలు వేయొచ్చుగాక. వాటిల్లో ఎంతో కొంత నిజం కూడా వుండి వుండొచ్చుగాక. కానీ, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పార్టీ వీడుతున్నారంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు చాలా సీరియస్‌గా పార్టీలో సమాలోచనలు జరగాలి. అయితే, అలాంటివేమీ వైఎస్సార్సీపీలో ఇప్పటిదాకా జరగలేదు. ‘పోతే పోనీ..’ అన్న వైఖరే వైఎస్సార్సీపీలో కన్పిస్తోంది.

ఎమ్మెల్యేలు చేజారిపోతే, అసెంబ్లీలో బలం తగ్గిపోతుంది. ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీలో గట్టిగా నిలబడలేకపోవడానికి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కూడా ఓ కారణం. ఎంపీలు పార్టీ నుంచి బయటకు వెళితే, పార్లమెంటులో పార్టీ వీక్‌ అయిపోతుంది. ఇవి చాలా సీరియస్‌ అంశాలు. అయినాగానీ, వలసల్ని ఆపలేకపోతుండడంతో ఏమీ చేయలేక వైఎస్సార్సీపీ చేతులెత్తేస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నేపథ్యంలో, ఆయా నియోజకవర్గాల్లో ఇంతవరకూ ప్రత్యామ్నాయ శక్తుల్ని ‘ఎలివేట్‌’ చేయలేకపోయింది వైఎస్సార్సీపీ. ఇదీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.

మొత్తంగా చూస్తే, పార్టీ ఫిరాయింపులు వైఎస్సార్సీపీని దారుణంగా దెబ్బతీశాయన్నది నిర్వివాదాంశం. ఈ రోజుల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమనీ, వాటిని నివారించలేం కాబట్టి చేయగలిగేదేమీ లేదనీ మిన్నకుండిపోతే.. భవిష్యత్‌ రాజకీయం దారుణంగా తయారవుతుంది. 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడ్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్‌ ఎప్పటికప్పుడు తన వ్యూహాల్ని మార్చుకోవాల్సి వుంటుంది. ఫిరాయింపుల కారణంగా ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ప్రత్యామ్నాయాల్ని ఇప్పటికైనా చూసుకోవాల్సిందే. లేదంటే, ఈ ఎఫెక్ట్‌ 2019 ఎన్నికలపై చాలా గట్టిగా పడ్తుంది. అప్పుడిక, పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.