వ‌ర్మ గానీ ఆ సినిమా తీసి ఉంటే..

నాలుగు నెలల కిందట చైనాలో పుట్టిన క‌రోనా వైరస్‌కు సంబంధించిన సంకేతాలు పదేళ్ల కిందటే ఓ సినిమాలో రావడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమా పేరు.. కంటేజియాన్. 2010లో తెరకెక్కిన ఈ చిత్రం 2011లో హాలీవుడ్లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు.

కానీ ఇప్పుడు ఆన్ లైన్లో ఈ సినిమాను కోట్ల‌మంది ఎగ‌బ‌డి చూస్తున్నారు. అచ్చంగా ఇప్ప‌టి ప‌రిస్థితులే తొమ్మిదేళ్ల కింద‌ట తీసిన ఆ సినిమాలో క‌నిపిస్తుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఐతే మ‌న రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఇలాగే ఓ ప్రాణాంతక వైర‌స్ క‌థ‌తో రెండేళ్ల కిందట ఇలాంటి సినిమానే తీయ‌డానికి స‌న్నాహాలు చేయ‌డం విశేషం. వైర‌స్ పేరుతోనే తీయాల‌నుకున్న ఆ సినిమా గురించి అప్ప‌ట్లో మీడియాకు ఓ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. దీనిపై ఫేస్ బుక్ పోస్టు కూడా పెట్టాడు.

2018 నాటి ఆ పోస్టును వ‌ర్మ ఇప్పుడు మ‌ళ్లీ షేర్ చేశాడు. వేరే దేశం నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి కార‌ణంగా ముంబ‌యి వాసులు వైర‌స్ బారిన ప‌డ‌టం.. అది ప్ర‌మాద‌క‌ర రీతిలో న‌గ‌ర‌మంతా వ్యాప్తి చెంద‌డం.. ల‌క్ష మందికి పైగా వైర‌స్ సోక‌డం.. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఒక్కొక్క‌రు 20 అడుగుల దూరం పాటించాలని ఆదేశాలు రావ‌డం.. ఎవరైనా ముంబ‌యి సిటీ దాటి బ‌య‌టికి వెళ్లాల‌ని చూస్తే కాల్చేవేసేలా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌డం.. చివ‌రికి ఈ వైర‌స్ బారి నుంచి ముంబ‌యిని కాపాడ‌టం మీద క‌థ న‌డిచేలా వ‌ర్మ స్క్రిప్టు త‌యారు చేశాడు.

ఈ విశేషాల‌న్నీ అప్పుడే ఫేస్ బుక్ పోస్టులోనే వ‌ర్మ వెల్ల‌డించ‌డం విశేషం. ఒక‌వేళ వ‌ర్మ ఈ సినిమా తీసి ఉంటే కంటేజియాన్ లాగే ఇప్పుడు చర్చ‌నీయాంశం అయ్యేదేమో.