సినిమా డైలాగులిక చెల్లవ్ : ఇక జైలుకే!

‘అయితే ఏం చేస్తావ్ రా… కోర్టుకు వెళ్తావా… నువ్ కోర్టుకెళ్లి నామీద కేసు వేసి.. నేను తప్పు చేశానని నిరూపించేలోగా.. నా పదవీకాలం కూడా పూర్తయిపోతుంది.. ఇంకేం చేస్తావ్ రా…’’ అంటూ సినిమాల్లో విలన్ పాత్రల్లో ఉండే రాజకీయ నాయకులు హీరోలను బెదిరిస్తూ ఉంటారు. ఈ తరహా నాటకీయ డైలాగులకు ఇక కాలం చెల్లినట్లే.

రాజకీయ నాయకులపై వచ్చే కేసుల విచారణలో జాప్యం లేకుండా పరిష్కరించడానికి, ఈ కేసులను ప్రతిరోజూ విచారించి, దాదాపుగా ప్రతి కేసులోనూ ఏడాదిలోగా తీర్పును తేల్చేయడానికి వీలుగా కోర్టుల పనితీరులో మార్పు తీసుకురావాలని సుప్రీం న్యాయస్థానం సంకల్పిస్తోంది. అవసరమైతే రాజకీయనాయకులపై కోర్టులను విచారించడానికే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అయినా..ఎమ్మెల్యేలు, నాయకులపై ఉండే కేసుల సంగతి ఓ పట్టు పట్టాలని సుప్రీం కోర్టు సూచిస్తోంది.

దేశంలో ప్రజాప్రతినిధులపై వస్తున్న నేరారోరపణల విచారణ పర్వం ఒక ప్రహసనంగా మారుతోంది. 2014 ఎన్నికల తర్వాత.. చట్టసభలకు ఎన్నికైన వారిపై నమోదు అయిన కేసులు దేశంలో 1581 ఉన్నాయి. వీటివిషయంలో ఇప్పటిదాకా ఏం చేశారు? ఏం సాధించారు? వివరాలు మొత్తం వెంటనే చెప్పాలంటే సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

శాసనసభలకు ఎన్నికౌతున్న వారిపై వస్తున్న ఫిర్యాదులు పెరుగుతుండడం, కేసులు తేలకపోతుండడం వల్ల.. వారు హాయిగా పదవులు అనుభవిస్తుండడాన్ని తప్పు పట్టింది. వీరి విచారణకు ప్రత్యేక కోర్టు ఉంటే తప్ప అన్ని కేసులను ఏడాదిలోగా తేల్చలేం అని స్పష్టం చేయడం విశేషం. అదే సమయంలో ఈ ప్రత్యేక కోర్టుల్ని సీబీఐ వంటి ఇతర ప్రత్యేక కోర్టులతో కలపకుండా స్వతంత్రంగా పని సాగించాలని కూడా సుప్రీం సూచించింది.

మొత్తానికి నేరగాళ్లు మూడో వంతుకు పైగా చట్టసభల్లో ఎంట్రీ ఇస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి వారి వ్యవహారాల్ని తేల్చడానికి కోర్టులు పూనిక వహించడం విశేషం. అలాగే నేరాభియోగాలు రుజువైతే ప్రస్తుతం ఆరేళ్లపాటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే పద్ధతి అమల్లో ఉంది. ఇలాంటి నిషేధాన్ని జీవితకాలం ఉండేలా అమలు చేయాలంటూ ఎన్నికల సంఘం న్యాయస్థానాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం అడ్డు చెబుతోంది.

అయితే ఒకసారి నిషేధానికి గురైన వారు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికవుతున్నారా? అనే ఉదాహరణలు చెప్పకుండా.. ఇలాంటి నిరాధార డిమాండ్లు చేయడం సరికాదంటూ సుప్రీం న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి చట్టసభల్లో, చట్టాలను తయారుచేసే పాత్రలో నిష్కళంకులు మాత్రమే ఉండేలా చర్యలుతీసుకునే ప్రక్రియ కొంత వేగం పుంజుకుంటున్నట్లే లెక్క. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే.. మరో దశాబ్దం తర్వాత అయినా.. సచ్ఛరిత్రులతో సభలు ఉంటాయని అనుకోవచ్చు.