సినీ పరిశ్రమని విభజించిన ‘నంది’

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా, తెలుగు సినీ పరిశ్రమలో చీలిక రాలేదు. చిన్న చిన్న విభేదాలు సినీ పరిశ్రమలో సహజమే అయినా, అవెప్పుడూ ఇంత తీవ్రమైన స్థాయిలో ‘విభజన’కు దారి తీయలేదు. స్వర్గీయ ఎన్టీఆర్‌ కాలం నుంచే చిన్న చిన్న విభేదాలున్నాయిగానీ, ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్ని ఎప్పుడూ చూడలేదని సినీ పరిశ్రమలో ‘సీనియర్లు’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నంది అవార్డుల పుణ్యమా అని సినీ పరిశ్రమలో ‘రెండు వర్గాలు’ ఏర్పడ్డాయి. ఒకటి ‘నంది’ అనుకూల వర్గం, ఇంకొకటి ‘నంది’ వ్యతిరేక వర్గం. ఇక్కడా మళ్ళీ కులాల కుంపటి మామూలేననుకోండి.. అది వేరే విషయం. ‘నందులు ఇవ్వకపోయినా బాగుండేదేమో..’ అన్న వాదన ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బలంగా విన్పిస్తోంటే, సినీ పరిశ్రమలో నంది పెట్టిన చిచ్చు ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

‘అయినవారికి అవార్డులు ఇచ్చుకోవడం’ అనేది ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమైనా, దానికి కాస్తంతైనా హద్దూ అదుపూ వుండేది. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ‘నంది’ వ్యతిరేకులు చేస్తున్న వాదనల్లో నూటికి నూరుపాళ్ళూ నిజం వుంది. అదే సమయంలో ‘నంది’ అనుకూలురు చూస్తున్న వాదనల్లో కాస్తంతైనా ‘పస’ లేకపోవడం గమనార్హమిక్కడ.

బూతులు తిట్టుకుంటున్నారు.. సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు.. మీడియా చర్చల్లో రచ్చ చర్చ చేసేస్తున్నారు.. ముందు ముందు పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారవనుందోగానీ, ఆ పరిస్థితి రాకుండానే ‘సినీ పరిశ్రమ పెద్దలు’ అత్యవసరంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వుంది. కానీ, పెద్దలెవరూ నోరు మెదకపోవడం గమనార్హమిక్కడ.