కాకి పిల్ల కాకికి ముద్దు అని ఒక సామెత. ఎవరి ప్రాడక్ట్ వాళ్లకు గొప్పగానే అనిపిస్తుంది. అలాగని మరీ అతి చేసి చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. తమ సినిమాల గురించి పాజిటివ్‌గా చెప్పుకుని ప్రేక్షకుల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా చేయడం వరకు ఓకే. కానీ ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రాలేదు.. ఒక్క క్షణం కూడా తల తిప్పలేని విధంగా సినిమా ఉంటుంది అంటేనే అతిగా ఉంటుంది.
‘హిట్’ సినిమా విషయంలో హీరో విశ్వక్సేన్ ఇలాంటి మాటలే అన్నాడు. దీని కంటే ముందు తమిళంలో ఇదే స్టయిల్లో ’16’ అనే సినిమాకు ఇంతకంటే పకడ్బందీగా తీశాడు కార్తీక్ నరేన్ అనే యువ దర్శకుడు. అడివి శేష్ మూవీ ‘క్షణం’ కూడా మిస్టరీ స్టయిల్లో సాగే అదిరిపోయే థ్రిల్లర్. కానీ వీటి గురించి మరిచిపోయి ‘హిట్’ గురించి ఊదరగొట్టేశాడు విశ్వక్.
ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రాలేదన్నాడు. మంచినీళ్లు ఎక్కువ తాగొద్దు.. మధ్యలో టాయిలెట్‌కు వెళ్లలేక ఇబ్బంది పడతారన్నారు. 15 నిమిషాలు మీరు కూర్చోండి.. తర్వాత నేను కూర్చోబెడతా.. ఇలా పెద్ద పెద్ద కామెంట్లే చేశాడు. దీంతో జనాలు చాలా ఎక్కువ ఊహించుకుని థియేటర్లకు వెళ్లారు. మామూలుగా చూస్తే ‘హిట్’ మంచి థ్రిల్లరే. కొత్త దర్శకుడు శైలేష్ కొలను దీన్ని బాగానే డీల్ చేశాడు. కానీ విశ్వక్ చెప్పిన స్థాయికి దగ్గర్లో కూడా ఈ సినిమా లేదు. సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ మిస్సయింది. టెక్నికల్ డీటైలింగ్ మరీ ఎక్కువైంది. మిడిల్ పోర్షన్లు అంత ఆసక్తికరంగా లేవు.
మొత్తంగా ‘హిట్’ యావరేజ్ అనిపించుకుందంతే. జనాలు ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్లి నిరాశ చెందుతున్నారు. విశ్వక్సేన్ వ్యాఖ్యలు ఓపెనింగ్స్‌కు ఏమాత్రం ఉపయోగపడ్డాయో ఏమో కానీ.. అసలే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులుండే థ్రిల్లర్ జానర్ మూవీ.. పైగా అంచనాలకు తగ్గట్లు లేదనే ఫీడ్ బ్యాక్ వల్ల సినిమాపై బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.