హీరో విజయ్‌ది ఏ మతం.?

నిన్న మొన్నటిదాకా హీరో విజయ్‌ ఏ మతానికి చెందినవాడు.? అన్న విషయమై ఎక్కడా చర్చ జరగలేదు. ఇప్పుడు మాత్రం విజయ్‌ మతం గురించిన చర్చ జరుగుతోంది. ఆ చర్చకు తెరలేపింది కూడా భారతీయ జనతా పార్టీ కావడం గమనార్హం. విజయ్‌ హీరోగా నటించిన ‘మెర్సల్‌’ సినిమాలో జీఎస్‌టీపైనా, వైద్య రంగంపైనా కొన్ని డైలాగులున్నాయి. అవి బీజేపీ నేతలకు నచ్చలేదాయె. అంతే, విజయ్‌ క్రిస్టియానిటీని బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెచ్చిన ‘అసహనం’ అనే రాజకీయం చూశాం.. ఇప్పుడు దాన్ని మించిన అసహనం బీజేపీ నేతల్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎవరు ప్రశ్నించినాసరే, వారి మతం గురించిన ప్రస్తావన వస్తోంది. అంతేనా, బీజేపీ పాలనను ప్రశ్నించినా, బీజేపీని విమర్శించినా వారంతా ‘దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే’ అన్న ముద్ర వేసేస్తున్నారు కమలనాథులు.

ఇక, తన కుమారుడు ఏ మతస్థుడు.? అన్న విషయమై హీరో విజయ్‌ తండ్రి స్పందించారు. ‘నా పేరు చంద్రశేఖర్‌.. విజయ్‌ ఏ మతానికి చెందినవాడన్న ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. మతం అన్నది వ్యక్తిగతం. విజయ్‌ క్రిస్టియన్‌ కాదు, ముస్లిం కాదు, హిందూ కాదు.. విజయ్‌ ఓ మనిషి, ఓ భారతీయుడు.. ఇంకేమన్నా క్లారిటీ కావాలా.?’ అంటూ విజయ్‌ తండ్రి చెప్పుకొచ్చారు.

‘విజయ్‌ మాత్రమే కాదు, జనాన్ని ప్రభావితం చేయగలిగేవారెవరైనా రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓ సినిమాని తట్టుకోలేనంత అసహనం నేటి పాలకుల్లో కన్పిస్తోందంటే, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు.’ అని దర్శకుడు కూడా అయిన ఎ.చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడనగానే, అతనిది తమిళనాడు కానే కాదన్న వాదన తెరపైకొచ్చింది. కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడంటే, ‘నీది ఏ రంగు.?’ అన్న ప్రశ్న పుట్టుకొచ్చింది. చిత్రంగా సినీ ప్రముఖుల విషయంలోనే ఈ రంగు, ప్రాంతం, మతం అంశాలు ఎందుకు తెరపైకొస్తున్నాయట.?