19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర సంక్షోభంలో పడింది. మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి యువ నేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పెను సంచలనం రేపింది.

ఈ 19 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపించడంతో రాజీనామాలపై వస్తోన్న ఊహాగానాలు నిజమయ్యాయి. సింధియా రాజీనామాతో పాటు 19మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కూలడం ఖాయమని తెలుస్తోంది. బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకువస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సింధియా అండ్ కో షాకివ్వడంతో కమల్ నాథ్ ఇరకాటంలో పడ్డారు. రాజీనామా చేసిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులుండడం విశేషం.

ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సింధియా….తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించిన సంగతి తెలిసిందే. గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశానని… కాంగ్రెస్ పార్టీలో ఉండి అనుకున్నది సాధించలేకపోతున్నానని సింధియా చెప్పారు. ఇక, ఈ 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి సింధియా నేడో రేపో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలున్నాయి.

మ్యాజిక్ ఫిగర్ 116. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకుంది. 2014లో అధికారం చేపట్టిన బీజేపీ 2019లో 107 స్థానాలకే పరిమితమైంది. 4 స్వతంత్రులు, ఒక ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కలిసి 121 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజాగా, ఆ 19 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపే అవకాశముండడంతో 126 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నల్లేరుమీద నడకే అని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమల్ పూర్తయిందని….ఆపరేషన్ కమల్ తో సీఎం కమల్ నాథ్ కు షాక్ తగిలిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రధాని మోడీ, షాలను కలిసిన సింధియా…పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. పార్టీ నుంచి సింధియా బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. తన రాజీనామా లేఖను పంపిన నిమిషాల వ్యవధిలోనే సింధియాను కాంగ్రెస్ బహిష్కరించింది.