రాజమౌళికి కొత్త తలనొప్పిని తెచ్చిన శాతకర్ణి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది ఇప్పుడు రాజమౌళి పరిస్థితి. నిజానికి బాలకృష్ణ వందో సినిమాగా అందరి దృష్టిని ఆకర్షించిన శాతకర్ణి.. విడుదలయ్యాక మాత్రం మొత్తం సీన్ మారిపోయింది. ఈ సినిమాను ఇప్పుడు బాలయ్య సినిమా కంటే కూడా క్రిష్ సినిమాగా చూస్తున్నారు. శాతకర్ణి చూసి బయటకు వచ్చాక.. మాటలన్నీ డైరెక్టర్.. సినిమా బడ్జెట్.. తీసిన టైం మీదనే ముచ్చట్లు నడుస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శాతకర్ణి సినిమా రాజమౌళిని టార్గెట్ చేయటం సరికొత్త అంశంగా మారింది. సినిమాను చూసి బయటకు వచ్చినోళ్లంతా అన్నేసి సంవత్సరాలుసినిమా తీయాల్సిన అవసరం ఉందా? అన్నేళ్లు.. చెక్కేసి తీసిన బాహుబలికి.. కేవలం 79 రోజుల్లో షూటింగ్ ముగించిన శాతకర్ణికి మధ్య తేడా పెద్దేం ఉందన్న మాటలు విమర్శలుగా మారాయి.

సినిమా అంటే ప్లాన్ గా.. ఫాస్ట్ గా తీయాలే తప్పించి.. ఏళ్ల తరబడి చేయటం కాదన్న మాట ఇప్పుడు రాజమౌళికి ఇబ్బందిగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శాతకర్ణికి.. రాజమౌళికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ఇప్పుడు మాత్రం అందరికి టార్గెట్ అయ్యారనే చెప్పాలి. బాహుబలిని అన్నేసి సంవత్సరాలు తీయటాన్నితమ మధ్య చర్చల్లో ప్రశ్నిస్తున్న వైనం చూసినప్పుడు.. శాతకర్ణితో రాజమౌళికి సరికొత్త తలనొప్పి తెచ్చి పెట్టిందనటంలో సందేహం లేదు.