యాంకర్ అనసూయ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ పెట్టడం.. ట్విట్టర్ జనాలు ఏదో ఒక కామెంట్ చేయడం.. కొంచెం తీవ్రంగా ఉన్న కామెంట్ల మీద అనసూయ ఫైర్ అవడం.. దీని మీద పెద్ద డిస్కషన్ నడవడం మామూలే. ఇలా గతంలో చాలాసార్లు జరిగింది. ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో తీసుకున్న నిర్ణయాలపై స్పందించింది.
ఈ నెల 31 వరకు రాష్ట్రమంతా లాకౌట్ అని.. రవాణా సహా అన్ని బంద్ అవుతాయని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడించాడు. దీనికి అందరూ సహకరించాలని కోరాడు. ఈ ట్వీట్‌పై అనసూయ స్పందించింది.
తాను ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తా.. అంగీకరిస్తా అంటూనే.. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే తనలా రోజు వారీ పనులకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. తాము పనులకు వెళ్లకుంటే ఇంటి అద్దె, పవర్ బిల్లులు, ఈఎంఐలు, ఇతర ఖర్చులు ఎలా భరించాలని అడిగింది. ఐతే సామాన్యుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాళ్ల పరిస్థితి ఏంటని అడిగితే జనాలు మద్దతిచ్చే వాళ్లేమో. కానీ తన లాంటి వాళ్లకు నెల వారీ ఖర్చులకు ఇబ్బంది అన్నట్లుగా ఆమె మాట్లాడటంతో నెటిజన్లు ఆమెను గట్టిగా నిలదీశారు.
నీకు నెల వారీ ఖర్చులకు ఇబ్బందా.. బ్యాంకులో ఉన్నదంతా బయటికి తీయి.. నీకే అలా ఉంటే మాలాంటి సామాన్యుల పరిస్థితేంటి.. చిన్న చితకా పనులు చేసుకునేవాళ్లు ఏమవ్వాలి.. వాళ్లే జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే నీకొచ్చిన ఇబ్బందేంటి అని అనసూయను నిలదీశారు. ఐతే తాను తనతో పాటు అందరి సమస్యను లేవనెత్తానంటూ అనసూయ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా నెటిజన్లు ఆగట్లేదు. ఆమె మీద దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.