ట్రంప్ వైఫ్యలాన్ని కళ్లకు కట్టేలా న్యూయార్క్ టైమ్స్ కథనం

ప్రపంచానికే పెద్దన్న అమెరికా. తిరుగులేని సాంకేతికత ఉన్న ఆ దేశం కరోనా ధాటికి ఎందుకంతగా విలవిలలాడుతోంది? ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసుల్ని ఎందుకు తెచ్చి పెట్టుకుంది? అంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణాలకు బాధ్యులు ఎవరు? న్యూయార్క్ మహానగరాన్ని కరోనా కారుమబ్బులా ఎందుకు కమ్మేసింది? ట్రంప్ సర్కారు ఎక్కడ ఫెయిల్ అయ్యింది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా తాజాగా ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని అచ్చేసింది. అమెరికాలో అత్యంత ప్రజాదరణ ఉన్న మీడియా సంస్థల్లో ఒకటిగా అభివర్ణించే న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది.

అమెరికా ఎదుర్కొంటున్న కరోనా కష్టాలకు కారణం అధ్యక్షుల వారి అసమర్థతేనని తేల్చారు. వైరస్ ఎంట్రీ అయ్యే సమయంలోనే అమెరికా నిఘా విభాగంతో పాటు.. జాతీయ భద్రత వర్గాలు.. ప్రభుత్వ ఆరోగ్య అధికారులతో పాటు అన్ని కేబినెట్ విభాగాలు తీసుకోవాల్సిన చర్యల గురించి ట్రంప్ ను హెచ్చరించాయట. అయితే.. వారి మాటల్ని ట్రంప్ లైట్ తీసుకోవటమే అమెరికన్ల కొంప మునిగేలా చేసిందంటున్నారు.

కరోనాను అడ్డుకునేందుకు సరైన వ్యూహం లేకపోవటం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో చోటు చేసుకున్న వైఫల్యంతోనే ఎక్కువమంది కరోనా వైరస్ బారిన పడినట్లుగా సదరు పత్రిక పేర్కొంది. జనవరి మొదట్లోనే వూహాన్ లో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకర వైరస్ గురించిన సమాచారం అందిందట. దాని తీవ్రతను అంచనా వేసే బాధ్యతల్ని జాతీయ భద్రతా కౌన్సిల్ లోని బయో డిఫెన్స్ వర్గాలకు అప్పగించారట. అయితే.. వైరస్ ను అడ్డుకునేందుకు ఉన్న మూడు వారాల విలువైన సమయాన్ని ట్రంప్ సర్కారు వేస్ట్ చేయటమే తాజా పరిస్థితికి కారణంగా చెప్పుకొచ్చారు.

ట్రంప్ నకు ముఖ్య వాణిజ్య సలహాదారుగా వ్యవహరించే పీటర్ నవారో సైతం జనవరి చివర్లో అధ్యక్షుల వారికి ఒక లేఖ రాసినట్లుగా బయటకు వచ్చింది. దీని ప్రకారం కరోనా కారణంగా అమెరికన్లు లక్షలాదిగా మరణిస్తారని.. ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్న అంచనాను వేశారట. అయితే.. ఈ విషయాన్ని ట్రంప్ సీరియస్ గా తీసుకోకపోవటంతో ఇప్పుడు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది.

అంతేకాదు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ట్రంప్ తన టీంలోని ప్రజారోగ్య సలహాదారుడ్ని పక్కన పెట్టి.. ఉపాధ్యక్షుడు మైక్ పొంపియాకు బాధ్యతలు అప్పగించటం కూడా తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. వైరస్ పై వార్ ఎలా చేయాలన్న విషయంలోనూ వైట్ హౌస్ రెండుగా చీలిపోయిందని చెబుతున్నారు. తాజాగా పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్న వేళ.. అందరిని కలుపుకుపోయే విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరులో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందని చెబుతున్నారు. ఏదైతేనేం.. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది?

ఇక.. న్యూయార్క్ మహానగరంలో కరోనా ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందటానికి కారణం ఏమిటి? అన్నది మరో ప్రశ్నగా మారింది. దీనిపై కొన్ని విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. కరోనాతో అమెరికాలో సంభవించిన మరణాల్లో సగం న్యూయార్క్ మహానగరానికి చెందినవే కావటం గమనార్హం. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువే. ఆదివారం నాటికి అమెరికాలో 5.33 లక్షల మందికి కరోనా పాజిటివ్ గా తేలగా.. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1.8లక్షలుగా ఉండటం మర్చిపోకూడదు. ఈ మాయదారి వైరస్ కారణంగా అమెరికాలో 20వేల మంది మరణిస్తే.. అందులో 8600 మంది న్యూయార్క్ నగరానికి చెందిన వారే.

ఈ మహానగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం.. విదేశీ ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండటం కరోనా విలయానికి కారణంగా చెప్పాలి. దీనికి తోడు వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులు న్యూయార్క్ కు శాపాలుగా మారాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో భౌతిక దూరాన్ని పాటించే విషయంలో ఫెయిల్ అయ్యారు.

దీనికి తోడు ఈ నగరానికి ఏటా ఆరుకోట్ల మంది విదేశీ ప్రయాణికులు వస్తుంటారు. ఒక విధంగా చూస్తే.. అమెరికాకు ఎంట్రీ పాయింట్ గా న్యూయార్క్ సిటీని అభివర్ణిస్తారు. దీనికి తోడు తొలి కేసు నమోదైన పదిహేను రోజులకు లాక్ డౌన్ విధించటం కూడా ఒక పెద్ద తప్పుగా చెప్పాలి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. కాస్తో కూస్తో ఊరటనిచ్చే అంశం.. గడిచిన రెండురోజులుగా న్యూయార్క్ లో కేసుల తీవ్రత కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే.. ముప్పు తొలిగిపోలేదు.