వకీల్‌సాబ్‌ కోర్ట్‌ సీన్‌ మినహా మొత్తం మార్చేశారట

బాలీవుడ్‌లో హిట్‌ అయిన పింక్‌ సినిమాను తెలుగులో వకీల్‌ సాబ్‌గా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్‌లో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని, పింక్‌ సినిమా తరహాలో కాకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌ గతంలో పలు సార్లు అనధికారికంగా చెప్పారు. తాజాగా కూడా నాగబాబు మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్‌ విభిన్నంగా కనిపిస్తాడని, పింక్‌కు మార్పులు చేశారని చెప్పాడు.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పింక్‌ సినిమా కథలోని మెయిన్‌ పాయింట్‌ను తీసుకుని వకీల్‌ సాబ్‌ను పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చినట్లుగా చెబుతున్నారు. అయితే సినిమాకు చాలా కీలకం అయిన కోర్టు సీన్‌ను మాత్రం ఉన్నది ఉన్నట్లుగానే తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. కోర్టు సీన్‌ మినహా మిగిలిన సీన్స్‌ను కాస్త కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ పవన్‌ ఇమేజ్‌కు సరిపోయే విధంగా తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.

పింక్‌లో లీడ్‌ పాత్రకు జోడీ ఉండదు. కాని వకీల్‌ సాబ్‌ చిత్రంలో మాత్రం పవన్‌ కు జోడీ ఉంటుందని, అలాగే ఐటెం సాంగ్‌ కూడా ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది సినిమా విడుదల అయితే కాని తెలియదు. ఈ కరోనా కల్లోలం లేకుంటే వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వకీల్‌ సాబ్‌ వచ్చేది ఎప్పుడనే విషయాన్ని నిర్మాత దిల్‌ రాజు కూడా చెప్పలేక పోతున్నాడు. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా వస్తుందనే ఆశతో పవన్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.