మహిళలే జ‘గన్’ టార్గెట్?

ఏపీలో ఓవైపు కరోనా కేసుల కల్లోలం కొనసాగుతున్నప్పటికీ, పాలనాపరమైన అంశాల్లో సీఎం జగన్ దూకుడుగానే వెళుతున్నారు. కేవలం కరోనాపై సమీక్షలకే పరిమితం కాకుండా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారు. మహిళలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన ఓ పథకాన్ని మళ్లీ జీవం పోశారు. పొదుపు సంఘాల మహిళలకు జీరో వడ్డీ పథకాన్ని తాజాగా ప్రారంభించారు. తద్వారా దాదాపు 91 లక్షల మంది మహిళలకు రూ.1400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నారు.

ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిధులను నేరుగా తల్లి ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్న జగన్.. మరోసారి మహిళలే టార్గెట్ గా ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ప్రభుత్వమైనా మహిళలను ఆకట్టుకుంటే వారికి తిరుగు ఉండదు. అందుకే ప్రతి నేతా అతివలను మంచి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నటి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో మహిళల ఖాతాల్లో డబ్బులు వేసిన ప్రయత్నమూ అలాంటిదే. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబు.. అకస్మాత్తుగా ఎన్నికల ముందు చేసిన జిమ్మిక్కులు మహిళలు, వృద్ధులకు అర్థం కావడంతోనే అర్ధరాత్రి వరకు చాంతాడంత క్యూలో నిలబడి మరీ ఆయన్ను గద్దె దించారు.

మరోవైపు జగన్ కూడా ఎన్నికల సందర్భంగా మహిళలకు పలు హామీలిచ్చారు. అయితే, చంద్రబాబు చేసిన తప్పు చేయకుండా తన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు జనవరిలో రూ.15వేల సాయం అందించారు. అలాగే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన వంటి పథకాలతో మరో 24 లక్షల మంది తల్లులు లబ్ధి పొందారు. అలాగే నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు.

తద్వారా ఏ పని చేసినా.. మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి మెప్పు పొందాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.94 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో దాదాపు రెండు కోట్ల మంది మహిళలే. ఇప్పటికే పలు పథకాల ద్వారా 75శాతం మంది మహిళలకు లబ్ది కలిగింది. రాబోయే కాలంలో కూడా అతివలకు ఇదే విధంగా పెద్దపీట వేయడం ద్వారా వారి మదిలో నిలిచిపోవాలన్నది జగన్ భావనగా తెలుస్తోంది.