ఏపీలో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌.. మొత్తం లెక్క 1332!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే కరోనా పరీక్షలు పెరిగినా, పాజిటివ్‌ కేసులు తగ్గడం కాస్త ఊరట అని చెప్పుకోవాలేమో. శ్రీకాకుళం జిల్లాలో ఓ కొత్త కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి కొత్తగా. కృష్ణా జిల్లాలో కొత్త కేసుల సంఖ్య 13. కర్నూలులో 11 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కడపలో నాలుగు, ప్రకాశం జిల్లాలో నాలుగు, విశాఖపట్నంలో ఓ కొత్త కేసు నమోదయ్యాయి. దాంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో నమైదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1332కి చేరుకుంది.

ఇప్పటిదాకా 31 మంది కరోనా పాజిటివ్‌తో మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 287 మంది డిశ్చార్జి కాగా, మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1014కి చేరుకుంది. ఇదిలా వుంటే, ఎక్కువ పరీక్షల విషమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెంచడం మంచిదే అయినా, ఆ పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేయడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ జరుగుతోంది.

మరోపక్క, తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువ కావడం, తక్కువగా కేసులు నమోదవడంపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ ఘాటుగా స్పందించారు. అవసరమైనవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామనీ, అనవసరమైన రీతిలో పరీక్షలు చేయడంలేదని తేల్చి చెప్పారు. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే తెలంగాణలో పరీక్షలు జరుగుతున్నాయన్నది తెలంగాణ మంత్రి వాదన. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి సర్వేలు చేస్తున్నామని పదే పదే ప్రభుత్వం చెబుతున్నా, కొత్త ప్రాంతాలకు వైరస్‌ విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.