విడుద‌ల కాలేని సినిమాల‌కు దారి చూపిన లాక్ డౌన్!

భారీ బ‌డ్జెట్ సినిమాల‌కే భారీ మొత్తాల‌తో ఎర వేస్తున్నాయి డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్స్. లాక్ డౌన్ వేళ పెద్ద సినిమాల‌ను డైరెక్టుగా విడుద‌ల చేసి.. త‌మ వినియోగదారుల సంఖ్య‌ను వీలైనంత‌గా పెంచుకోవాల‌ని ఆ యాప్స్ ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నాయి. వాటికి భారీగా పెట్టుబ‌డులు కూడా చేతికి అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పెద్ద సినిమాల‌కే అవి వ‌ల వేస్తూ ఉన్నాయి.

పెద్ద సినిమాలేమో కానీ, ఓ మోస్త‌రు సినిమాలు మాత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్స్ కు అందుతున్నాయి. చిన్న సినిమాల డైరెక్ట్ ఓటీటీ విడుదల మొద‌లైంది. ఒక‌వేళ క‌రోనా లాక్ డౌన్ లేక‌పోయి ఉంటే, డైరెక్ట్ ఓటీటీ విడుదల అనేది సాహ‌సించ‌ని అంశం. కానీ ఇప్పుడు ఇదీ ఒక మార్గంగా అగుపిస్తూ ఉంది మూవీ మేక‌ర్ల‌కు.

తమిళ‌నాట అయితే మ‌రో ట్రెండ్ మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే జ్యోతిక సినిమా ఒక‌దాన్ని మే లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దానిపై థియేట‌ర్ల వాళ్లు అబ్జెక్ష‌న్ చెబుతున్నారు. సూర్య సినిమాల‌ను నిషేధిస్తామంటూ వారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ హెచ్చ‌రిస్తున్నారు. అవ‌న్నీ ఉత్తుత్తి హెచ్చ‌రిక‌లే అయ్యే అవ‌కాశాలున్నాయి.

మ‌రోవైపు ఇప్ప‌టికే విడుద‌ల‌కు రెడీ అయిపోయి, ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో విడుద‌ల కాలేక‌పోయిన సినిమాల‌కు కూడా ఓటీటీలు ఎర వేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ తో, థియేట‌ర్లు దొర‌క‌ని చిన్న సినిమాలు, ఇంకా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో విడుద‌ల ఆగిపోయిన సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి ఓటీటీలు రెడీ అవుతున్నాయి.

త‌మిళ ద‌ర్శ‌క‌, నిర్మాత వెంక‌ట్ ప్ర‌భు రూపొందించిన ఒక సినిమా ఇప్పుడు అలానే విడుద‌ల అయ్యింది. ఆర్కే న‌గ‌ర్ పేరుతో ఈ సినిమా రూపొందింది. కోదండ‌రామిరెడ్డి త‌న‌యుడు వైభ‌వ్ హీరోగా న‌టించిన ఈ సినిమా రెండేళ్లుగా విడుద‌ల‌కు నోచుకోలేదు. ఈ నేప‌థ్యంలో దాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేశారు. థియేట‌ర్ల‌లో కాకుండా..డైరెక్టుగా ఇలా వెబ్ స్ట్రీమింగ్ యాప్ లో ఆ సినిమా విడుద‌ల అయ్యింది. వెంక‌ట్ ప్ర‌భు సినిమాల‌ను ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డే వాళ్లు ఉండ‌నే ఉంటారు. ఇలాంటి నేప‌థ్యంలో .. అత‌డి సినిమా డైరెక్టు ఓటీటీ విడుద‌ల ద్వారా వార్త‌ల్లోకి వ‌చ్చింది.

ఏ భాష‌లో చూసినా విడుద‌ల‌కు నోచుకోని సినిమాలు బోలెడ‌న్ని ఉండ‌నే ఉంటాయి. అలాంటి వాటికి లాక్ డౌన్ వేళ డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్స్ మంచి ప‌రిష్కార మార్గాలుగా క‌నిపిస్తున్న‌ట్టున్నాయి.