ఆంధ్రాలో తగ్గింది, తెలంగాణలో పెరిగింది: కేసీఆర్ రివర్స్ గేర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా ఆంధ్రపదేశ్ అభివృద్ధి విషయమై పరోక్షంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో నాలుగెకరాలు అమ్మితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా కొనలేని పరిస్థితి వుండేదనీ, ఇప్పుడు అక్కడ నాలుగు ఎకరాలు అమ్మితే తెలంగాణలో ఒక ఎకరం కొనడానికి వీల్లేనంతగా ధరలు పెరిగాయనీ, రియల్ ఎస్టేట్ ఇప్పుడు తెలంగాణలో మరింతగా వృద్ధి చెందిందనీ కేసీయార్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో.. జిల్లాకో ఎయిర్ పోర్టు.. అంటూ చేసిన ప్రచారం అక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. రాజధాని అమరావతి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. అయితే, ఆ స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగలేదనుకోండి.. అది వేరే సంగతి.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని అయోమయంలో పడేయడంతో.. రాష్ట్రం మీద రియల్ ఎస్టేట్ రంగం గతంలో పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఎక్కడికక్కడ భూముల ధరలు పడిపోయాయి. కొనుగోళ్ళు నిలిచిపోయాయి కూడా. ఏ భూమిపై ఎలాంటి వివాదం తెరపైకొస్తుందో తెలియని పరిస్థితి.

ఇంకోపక్క తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెడుతూ, ‘ధరణి’ అనే కాన్సెప్ట్ తెరపైకొచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా దీన్ని అమల్లోకి తెచ్చింది. దాంతో, తెలంగాణలో భూ వివాదాలకు ఆస్కారం తగ్గుతోంది. అభివృద్ధి విషయంలో ఆంధ్రపదేశ్ పేరు సరిగ్గా వినబడకపోవడంతో.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పెట్టుబడిదారులు ఏపీని వదిలేసి, తెలంగాణ వైపు వచ్చేశారు. ఈ విషయాన్నే కేసీఆర్ తాజాగా వెల్లడించారు.

అన్నట్టు, మూడు రాజధానుల ప్రకటన, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత కూడా ఏపీపై రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోవడం గమనార్హం.