ఉద్యోగుల జీతాల కోసం కూడా ‘ముందే’ మీట నొక్కొచ్చగా సారూ..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీట నొక్కి ఫలానా సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేశారు, విడుదల చేస్తున్నారు.. అంటూ తరచూ పత్రికల్లో కథనాలు, ప్రకటనలు చూస్తున్నాం. ఇలా ప్రకటనల కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి, ఉద్యోగులు ఏం పాపం చేశారట.? ఉద్యోగులకోసం కూడా మీట నొక్కి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయొచ్చు కదా.? ఓహో, ఇందుకోసం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటే బాగోదని బహుశా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోందేమో.

ఫర్లేదు, రాష్ట్ర ప్రజలు కొత్తగా అనుకోవడానికేమీ లేదు. ఇకపై, ఉద్యోగుల జీతాల్ని కూడా సకాంలో మీట నొక్కి, సంక్షేమ పథకాల తరహాలోనే విడుదల చేస్తే మంచిదన్నది చాలా మంది ఉద్యోగుల మనసులో మాట. పైకి చెప్పుకోలేని దుస్థితి ఉద్యోగులది. ‘మా బతుకు మరీ దయనీయంగా తయారైపోయింది. అప్పులు చేసుకుని, ఇంట్లో ఖర్చులు వెల్లదీసి, జీతం వచ్చాక, అప్పులు తీర్చాల్సి వస్తోంది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఉద్యోగుల జీతాల్ని కూడా సంక్షేమ పథకాల తరహాలో చూసి, ప్రభుత్వం మాకు సకాలంలో జీతాల అందిస్తే బావుంటుంది..’ అని ఉద్యోగులు వాపోతున్నారు.

నిజానికి, ఇదో చాలా చిత్రమైన పరిస్థితి, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న మాట వాస్తవం. అందుకే, అభివృద్ధి అన్న మాటకే చోటు లేకుండా పోయింది. కానీ, అప్పులు కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. అలా అప్పు చేసిన సొమ్ములన్నిటినీ, పొలిటికల్ పబ్లిసిటీ కోసం సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వింత పరిస్థితి లేదు. తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలూ తమతమ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అక్కడెక్కడా ఇంత పబ్లిసిటీ పైత్యం అక్కడి అధికార పార్టీలకు లేదు. పైగా, అక్కడెక్కడా ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో ఉద్యోగులు వైసీపీకి అండగా నిలిచారు. అదే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పిదం అనుకోవాలేమో.