బాలకృష్ణను దూరంగా చూసినవారు ఆయనకి కాస్త కోపం ఎక్కువని అనుకుంటారు. ఆయనను దగ్గరగా చూసినవారు ఆయన మనసు మంచిదని చెబుతారు. బాలకృష్ణ ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే మరో వైపున పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. అలాగే బసవతారకం కేన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన విషయాలను కూడా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్న ఎంతోమందికి గతంలో ఆయన సహాయ సహకారాలను అందించారు.
తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ – మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన ‘మణిశ్రీ’ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడింది. బసవతారకం కేన్సర్ హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారట. ఆ పాప పేరెంట్స్ తమ దగ్గర లక్షా ఎనభై వేలకి మించి లేవని హాస్పిటల్ వారిని రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా బాలకృష్ణ ఫ్యాన్స్ క్లబ్ ద్వారా ఆయనను కలిసి తమ పాప పరిస్థితిని గురించి వివరించారట. దాంతో ఆయన మిగతా ఖర్చును తాను భరిస్తానని చెప్పి ఆపరేషన్ జరిగేలా చేశారట. ఆపరేషన్ పూర్తిచేసుకున్న ఆ పాప సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.