ఘాజీ హిట్టే కానీ రాణాకి అడ్డంకే

ఘాజీ హిట్‌తో తొలిసారి సోలో విజయాన్ని ఆస్వాదిస్తోన్న దగ్గుబాటి రాణాకి ఈ విజయం వల్ల కొత్త తలనొప్పులు వచ్చి పడతాయి. రెగ్యులర్‌ హీరోలా కమర్షియల్‌ సినిమాలని రాణానుంచి ప్రేక్షకులు ఇకపై ఆశించరు. ఘాజీలాంటి వైవిధ్యభరిత చిత్రాలని, ప్రయోగాలని కోరుకుంటారు. దీని వల్ల ప్రతిసారీ రాణా కొత్తదనం వెంట పరుగులు తీయాలి. అలాగే ఇలాంటి సినిమాల రీచ్‌ తక్కువ. ఎంత హిట్‌ అయినా కానీ ఒక రేంజ్‌ అయితే దాటిపోవు.

పెద్ద హిట్లు కొట్టాలంటే రెగ్యులర్‌ సినిమాలు చేయాల్సిందే. అలా అని అటు వైపుగా అడుగేసాడంటే ఇప్పుడు మెచ్చుకున్న వాళ్లే తిరస్కరించే ప్రమాదం వుంటుంది. అలాగే తన ఫిజిక్‌కి ఫ్యామిలీ కథల్లోకి, ప్రేమకథల్లోకి ఇమడడం కష్టం. ఏం చేసినా లార్జర్‌ దేన్‌ లైఫ్‌ యాక్షన్‌ సినిమాలు చేయాలి. అలాంటి సినిమాల పని ఏసి/డిసి అన్నట్టుంటుంది.

ఘాజీ చిత్రం సాధించిన సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నప్పటికీ ‘నెక్స్‌ట్‌ ఏంటి’ అనే క్వశ్చన్‌ మాత్రం రాణాని ఇరకాటంలో పెడుతోంది. బాహుబలి 2 అయినా తను కోరుకుంటోన్న మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెడితే ఓకే. లేదంటే ఎప్పుడూ మధ్య తరగతి సినిమాలతోనే కాలం గడపాల్సి వస్తుంది. అటు తేజ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కూడా పొలిటికల్‌ డ్రామా అంటున్నారు కనుక దాంతో ఏమైనా మాస్‌కి చేరువ అవుతాడనే నమ్మకాలు తక్కువ.