రాజకీయ రంగంతో మిగిలిన రంగాల్లో లేని దరిద్రాలు ఎన్నో సినిమా రంగంలో కనిపిస్తాయి. వెండితెరపై ఆదర్శవంతంగా వెలిగిపోయే అగ్రనటులు మొదలు.. వారిని గొప్పగా చూపించే దర్శక నిర్మాతల వరకు అందరూ ‘క్లాస్’ సిస్టంను పక్కాగా ఫాలో అవుతుంటారు. నటీనటుల్లోని టాలెంట్ కంటే కూడా.. వారికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు అనుగుణంగా మర్యాదను ఇవ్వటం కనిపిస్తుంటుంది. ఒక స్టార్ హీరోకు అడుగులకు మడుగులు వత్తటానికి అస్సలు మొహమాటం పడరు.
అదే సమయంలో.. టాలెంట్ ఉన్నా పేరు లేని వారిని మనిషిలా చూసేందుకు ఇష్టపడరు. ఇలాంటి తీరు బాలీవుడ్ లో ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ‘స్టార్’ హీరోగా గుర్తింపు పొందిన విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా షాకింగ్ గతాన్ని వెల్లడించారు. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పిన అతని మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. తొలిసారి టాలీవుడ్ లో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఎంట్రీపై ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలను తాజాగా వెల్లడించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. సినిమా రంగానికి వచ్చిన మొదట్లో తాను ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. ”సెట్ లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. స్పాట్ బాయ్ ను మంచినీళ్లు అడిగినా ఇచ్చేవాడు కాదు. సినిమా సెట్ లో అందరూకలిసి భోజనం చేయటానికి వీలు ఉండేది కాదు. స్టార్స్ కు.. నటీనటులకు.. జూనియర్ ఆర్టిస్టులకు వేర్వేరుగా భోజనాలు పెట్టేవారు. ఒకరోజు స్టార్స్ తో కలిసి భోజనం చేయాలనిపించింది. వాళ్లతో కలిసి భోజనానికి కూర్చుంటే.. కొంతమంది సిబ్బంది నా చొక్కా కాలర్ పట్టుకొని బయటకు తీసుకొచ్చేశారు” అంటూ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
నవాజ్ మాటకు సినీ ప్రియులు స్పందిస్తున్నారు. బాలీవుడ్ లోని కల్చర్ ను తిట్టిపోస్తున్నారు. నటీనటుల్ని సమానంగా చూడటం ఎప్పటికి నేర్చుకుంటారంటూ మండిపడుతున్నారు. మొత్తంగా నవాజ్ సిద్దిఖీ మాటలు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.