టాలీవుడ్ హీరోలకు శీలపరీక్ష

కలలో కూడా ఊహించని సన్నివేశమిది. హీరోయిజాన్ని ఎంజాయ్ చేస్తూ.. బాబుగారు అంటూ పిలిపించుకుంటూ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా టాలీవుడ్ హీరోలందరికి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. ప్రేక్షక దేవుళ్లు కానీ లేకుండా తాము లేమని.. వారి అభిమానానికి తాము దాసులమన్నట్లుగా వ్యవహరించే హీరోల నోటి నుంచి వచ్చే మాట కోసం ఏపీ యూత్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర నిర్వహించే మౌన దీక్షకు టాలీవుడ్ హీరోలు ఎంతమంది మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ మౌనదీక్షకు టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ తన పూర్తి సపోర్ట్ ప్రకటించేశారు. ఊహించని రీతిలో విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ మౌన దీక్షకు తన మద్దతును ప్రకటించటమే కాదు.. క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలంటూ పిలుపునివ్వటంతో ఈ వ్యవహారం అంత సింఫుల్ గా ముగిసేది కాదన్నది తేలిపోయింది.

మామూలుగా అయితే.. ఇలాంటి ఉద్యమాలకు.. నిరసన ప్రదర్శనల్లో తెలుగు హీరోలు ఇన్ వాల్వ్ మెంట్ ఉండేది కాదు. వారిని ఎవరూ ఇన్ వాల్వ్ చేసేవారు కాదు కూడా. కానీ.. తమిళనాడులో జల్లికట్టుపై విధించిన బ్యాన్ కు అక్కడి చిత్రపరిశ్రమలోని హీరోలంతా రియాక్ట్ కావటం.. ప్రజలకు అండగా నిలవటంతో.. మన హీరోల మాటేమిటన్నది సగటుజీవి ప్రశ్నగా మారింది. దీంతో.. ఏపీ ప్రత్యేకహోదా అంశంపై ఏ హీరో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఏపీయూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పాటు.. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఆందోళనకు తన మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక.. పవన్ మాజీ సతీమణి రేణుదేశాయ్ కూడా ఆర్కే బీచ్ ఆందోళనకు మద్దతును ప్రకటించారు. ఇదే బాటలో శర్వానంద్.. సాయిధరమ్ తేజ్..నిఖిల్ కూడా రియాక్ట్ అయ్యారు. వీరితో పాటు  సందీప్ కిషన్..శివబాలాజీ.. మొహర్ రమేశ్.. జానీ మాస్టర్.. లాంటి వారు కూగా ట్వీట్లతో తమ మద్దతును ప్రకటించారు. ఇక.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఆర్కే బీచ్ కి తమ మద్దతును ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. అగ్రహీరోలు మాత్రం ఎవరూ ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపూర్ణేష్ బాబు.. తనీశ్ లు తమ మద్దతును ఏపీ యూత్ కి ఇచ్చేశారు. ఏదో మాట వరసకుమద్దతు పలికితే సరిపోదని.. ఆందోళనలతో పాల్గొనాలని ఏపీ యూత్ కోరుకుంటోంది. ఇలాంటివి ఏ మాత్రం అలవాటు లేని టాలీవుడ్ అగ్ర హీరోలకు.. తాజా పరిణామం శీల పరీక్షగా మారిందనే చెప్పాలి.