‘150’ క్రెడిట్ మొత్తం అతనే తీసుకుంటున్నాడే

‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ మూవీ. అయినప్పటికీ ఈ సినిమా కోసం చాలామందే పని చేశారు. బేసిగ్గా పరుచూరి సోదరులు ఈ స్క్రిప్టు మీద పని చేస్తే.. ఆ తర్వాత ‘ధృవ’కు పని చేసిన వేమారెడ్డి కూడా తన వంతు సహకారం అందించారు. మధ్యలో ఇంకా ఒకరిద్దరు రచయితలు ఈ సినిమా కోసం పని చేసినట్లుగా వార్తలొచ్చాయి. వీళ్లందరూ కాకుండా కొంచెం ఆలస్యంగా సాయిమాధవ్ బుర్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడు.

సినిమాలో రచన క్రెడిట్ పరుచూరి సోదరులతో పాటు వేమారెడ్డికి.. సాయిమాధవ్ బుర్రాకు కూడా ఇచ్చారు. ఐతే సినిమా రిలీజ్ తర్వాత మాత్రం సాయిమాధవ్ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ అంతా ఆయనొక్కరే తీసుకుంటున్నారు. డైలాగ్స్ విషయంలో తనకు వచ్చిన ప్రశంసల గురించి సాయిమాధవ్ ఇంటర్వ్యూల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. చిరంజీవితో పాటు ‘ఖైదీ నెంబర్ 150’ యూనిట్ సభ్యులు కూడా ఎక్కువగా సాయిమాధవ్ పేరే ప్రస్తావిస్తున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తనకు రాజమౌళి ‘బాహుబలి’కి పనిచేసే అవకాశమిస్తే మరో రచయితతో కలిసి పనిని పంచుకోవడానికి అయిష్టత వ్యక్తం చేశానని.. తానొక్కడే మాటలు రాస్తానని అనడంతో ఆ అవకాశం పోయిందని అన్నాడు సాయిమాధవ్. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’కి మాత్రం పనిని పంచుకున్నాడు. ఐతే క్రెడిట్ మాత్రం ఆయనొక్కరికే వస్తోంది. పొరబాటున కూడా పరుచూరి సోదరుల పేరు కానీ.. వేమారెడ్డి పేరు కానీ.. ఎక్కడా వినిపించలేదు.

మరి స్క్రిప్టు విషయంలో వాళ్లేమైనా చేశారా అంటే.. తమిళంతో పోలిస్తే కామెడీ ట్రాక్ మినహా మార్పేమీ లేదు. ఇక వాళ్లు చేసిందేముంటుంది. మరి సినిమాలో డైలాగులన్నీ సాయిమాధవే రాశాడా.. అందులో పరుచూరి సోదరులు, వేమారెడ్డిల పాత్ర ఏమీ లేదా.. ముందు వాళ్లతో రాయించి వాటిని పక్కనబెట్టి సాయిమాధవ్‌కు ఆ బాధ్యత అప్పగించి.. ఊరికే వాళ్ల పేర్లు వేశారా అన్నది క్లారిటీ లేదు. మరి ‘ఖైదీ నెంబర్ 150’ డైలాగులకు సంబంధించి క్రెడిట్ మొత్తం సాయిమాధవ్ తీసుకుంటుండటంపై పరుచూరి బ్రదర్స్, వేమారెడ్డిల ఫీలింగేంటో మరి?