ఎన్టీఆర్.. కాపాడ‌గ‌ల‌డా?

ఇంకొక్క రోజులో ‘బిగ్ బాస్’ రియాల్టీ షో స్టార్ మా ఛానెల్లో మొదలు కాబోతోంది. ఐతే ఈ షో కాన్సెప్ట్ తెలిసిన వాళ్లందరూ ఇది అసలు దక్షిణాదిన వర్కవుటవుతుందా అన్న సందేహాలే వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తమిళ ‘బిగ్ బాస్’కు నెగెటివ్ టాక్ రావడం.. రేటింగ్స్ పూర్ గా ఉండటంతో తెలుగు షో మీద సందేహలు మరింతగా పెరుగుతున్నాయి.

ఈ షోలో పార్టిసిపెంట్లుగా ఎవరుంటారన్న దాన్ని బట్టి డైలీ ఎపిసోడ్లను జనాలు ఏమాత్రం చూస్తారన్నది ఆధారపడి ఉంటుందని కొందరంటుంటే.. షోలో ఎవరున్నా సరే మన జనాలకు ఇలాంటి షోలు అంతగా ఎక్కువనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు. ఐతే పార్టిసిపెంట్ల సంగతి.. బిగ్ బాస్ హౌస్ లో జరిగే వ్యవహారాల మాటెలా ఉన్నా.. ఎన్టీఆర్ ఉన్నాడులే అనే ధీమా నిర్వాహకుల్లో కనిపిస్తోంది.

ఈ షోకు ప్రధాన ఆకర్షణ అతనే అవుతాడని.. వారంలో రెండు రోజులే కనిపించినప్పటికీ ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో.. వాక్చాతుర్యంతో షోను రక్తికట్టిస్తాడని ఆశిస్తున్నారు. ఐతే ఎన్టీఆర్‌ను పెట్టి ఇప్పటిదాకా కట్ చేసిన  ప్రోమోలైతే పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

ఐతే షో మొద‌ల‌య్యాక ఎన్టీఆర్ ఆక‌ర్ష‌ణ వేరుగా ఉంటుంద‌ని.. షోలో మిగతా విశేషాల మాటెలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్ల వరకు ‘బిగ్ బాస్’కు ఆదరణ పరంగా తిరుగుండదని.. వాటికి రేటింగ్స్ అదిరిపోతాయని మా టీవీ వాళ్లు ఆశాభావంతో ఉన్నారు. మ‌రి  ‘బిగ్ బాస్’ షోను ఎన్టీఆర్ కాపాడేస్తాడో లేదో చూద్దాం.