డీజే షాక్.. ట్రైలర్ ఈ రోజే

చడీచప్పుడు లేకుండా ‘దువ్వాడ జగన్నాథం’ టీం పెద్ద షాకే ఇచ్చింది. ఈ రోజు రాత్రికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం వెల్లడించాడు. రాత్రి సరిగ్గా ఏడున్నర గంటలకు ‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్ విడుదలవుతుందని హరీష్ ప్రకటించాడు.

ఇంతకుముందు ‘డీజే’ టీజర్ రిలీజవ్వడానికి కొన్ని రోజులుండగానే ప్రకటన చేశారు. కౌంట్ డౌన్ మొదలుపెట్టి హంగామా చేశారు. ట్రైలర్ విషయంలోనూ అలాగే ముహూర్తం కొన్ని రోజుల ముందే ప్రకటించి నెమ్మదిగా హైప్ పెంచుతారనుకుంటే.. అలాంటిదేమీ లేకుండా సడెన్‌గా షాకిచ్చాడు హరీష్ శంకర్.

‘డీజే’ ట్రైలర్ నిడివి 2 నిమిషాలుంటుందని.. కథేంటో ఐడియా ఇచ్చేలా ట్రైలర్ ఉంటుందని.. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ట్రైలర్లో హైలైట్ అవుతాయని అంటున్నారు. ‘డీజే’కు సంబంధించి ఇప్పటిదాకా బయటికి వచ్చిన విశేషాలన్నీ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్.. ‘గుడిలో బడిలో మడిలో’ సాంగ్ టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రకంపనలు రేపాయి.

టీజర్.. సాంగ్ టీజర్‌లకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రికార్డుల మోత మోగింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో అని బన్నీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విషయంలో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలవడం ఖాయమని భావిస్తున్నారు.