డైరెక్ట్ రిలీజ్ లో పడ్డ తొలి వికెట్ ఇదే

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్నీ సినిమాలను డైరెక్ట్ గా తమ ద్వారా విడుదల చేసేలా నిర్మాతలను ఆశపెడుతున్నాయి. అయినా పెద్ద సినిమాలు, కొంచెం పేరున్న సినిమాలు దీని వల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని డైరెక్ట్ ఓటిటి వైపు చూసే పరిస్థితి లేదు.

భారీ ఆఫర్లు ఇచ్చినా కానీ బడా నిర్మాతలు ఈవైపు ఆలోచన చెయ్యట్లేదు. దాంతో పెద్ద సినిమాలు విడుదలవ్వడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. లాక్ డౌన్ ఎత్తేసినా కానీ థియేటర్లు మరో మూడు లేదా నాలుగు నెలలు తెరిచే పరిస్థితి ఉండబోవట్లేదు.

దీంతో పెద్ద సినిమాల మాటేమో కానీ చిన్న సినిమాలు మాత్రం ఇలా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైపోతే ఉత్తమమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు అన్ని నెలలు వడ్డీలను భరించడం అంటే తలకు మించిన భారమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాల్లో తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది.

చిన్న సినిమాగా విడుదల కావాల్సిన అమృతారామమ్ అనే సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతోంది. మాములు పరిస్థితులు ఉంటే ఈ సినిమా ఈ పాటికి విడుదలయ్యేదే. సురేష్ ప్రొడక్షన్స్ కంటెంట్ నచ్చి మరీ ఈ సినిమాను కొనుగోలు చేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ డీల్ రద్దయిపోయినట్లు ఉంది. ఇప్పుడు జీ5 యాప్ లో ఈ సినిమా విడుదలవ్వబోతోంది. ఈ నెల 29న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మరి డైరెక్ట్ రిలీజ్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.