పవన్‌తో హిట్‌ కొడితే కంటిన్యూ చేస్తా

తమిళ సంగీత సంచలనం అనిరుధ్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా కానీ ఫైనల్‌గా పవన్‌కళ్యాణ్‌ ఇరవై అయిదవ చిత్రానికి కుదిరింది. అంతకుముందు బ్రూస్‌లీ, అఆ చిత్రాలకి అనిరుధ్‌కి అడ్వాన్సులు కూడా ఇచ్చేసిన తర్వాత అతను తనకి కుదరడం లేదని చెప్పి వెళ్లిపోయాడు. ఈసారి త్రివిక్రమ్‌కి తనే కాల్‌ చేసి మ్యూజిక్‌ చేస్తానని చెప్పడంతో పవన్‌కళ్యాణ్‌ చిత్రానికి అతడిని తీసుకున్నారు.

తమిళంలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలుగుతోన్న అనిరుధ్‌ ఇకపై తెలుగులో ఏడాదికి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని, అందుకు అనుగుణంగా ప్లాన్‌ చేసుకుంటానని చెప్పాడు. అయితే పవన్‌ సినిమా హిట్‌ అయి, తన మ్యూజిక్‌ని తెలుగువారు లైక్‌ చేస్తేనే కంటిన్యూ చేస్తానని, లేదంటే తమిళ రంగానికే పరిమితం అవుతానని అతను తెలిపాడు.

అనిరుధ్‌ తెలుగు ఇండస్ట్రీకి రావడమంటే ప్రస్తుతం ఇక్కడ టాప్‌లో వున్న దేవిశ్రీప్రసాద్‌, తమన్‌లాంటి వారికి కాంపిటీషన్‌ వచ్చినట్టే. అనిరుధ్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమిళ చిత్ర సీమలో యువన్‌ శంకర్‌ రాజా, హారిస్‌ జైరాజ్‌ లాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో మాదిరిగా అగ్ర హీరోలు ఏ.ఆర్‌. రహమాన్‌ వెంట పడడం కూడా తగ్గించేసారు. మరి అనిరుధ్‌ తెలుగునాట ఎలాంటి సంచలనం చేస్తాడనేది చూడాల్సిందే.