అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు..భార‌తీయుడి మృతి

అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ పెరిగిపోతోంది. తుపాకీ తూటాకు అక్కడ నివసిస్తున్న ఒక భారతీయుడు బలయ్యాడు. భారత్‌కు చెందిన ఖండు పటేల్(56) అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, వైట్‌హవెన్‌లోని జాతీయరహదారి పక్కన ఉన్న బెస్ట్‌వాల్యూ ఇన్, సూట్స్ మోటల్‌లో ఎనిమిది నెలలుగా సహాయకుడిగా పనిచేస్తున్నారు.

భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మోటల్ వద్దే నివసిస్తున్నారు. ఎప్పటిలాగానే గత సోమవారం విధులు ముగించుకుని, మోటల్ వెనుకభాగంలో నిలుచుని ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన తూటా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దూరంగా కొందరు పరస్పర కాల్పులకు పాల్పడ్డారని, ఎవరో 30 తూటాలను కాల్చగా, వాటిలో ఒక తూటా పటేల్ ఛాతిలోకి దిగిందని స్థానిక వార్తాసంస్థ తెలిపింది.

అనంతరం రీజినల్ మెడికల్ సెంటర్‌కు తరలించగా ఆయన మృతిచెందాడని అధికారులు చెప్పారు. కొత్త ఉద్యోగం కోసం వారి కుటుంబం వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించుకున్నాక ఈ దారుణం జరిగిపోయిందని పటేల్ మేనల్లుడు జై పటేల్ ఆవేదన వ్యక్తంచేశారు. కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఫిబ్రవరి మొదలుకొని ఇప్పటివరకు అమెరికాలో వివిధ సంఘటనల్లో ఐదుగురు భారతీయులు తుపాకీ కాల్పుల్లో మరణించడం క‌ల‌క‌లంగా మారింది.