దగ్గుబాటి రానా.. మరో ఇంట్రెస్టింగ్ రోల్

‘బేబీ’ సినిమాతో రానా దగ్గుబాటి కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ‘బాహుబలి’తో అతడి రాతే మారిపోయింది. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా ప్రతి ఇండస్ట్రీ కూడా అతడి కోసం ప్రత్యేక పాత్రలు ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది ‘ఘాజీ’తో ఈ మూడు భాషల ప్రేక్షకులనూ మెప్పించాడు రానా.

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రానాను వెతుక్కుంటూ వచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాలో సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించబోతున్నాడట రానా.

కన్నడ దర్శకుడు ఏఎంఆర్ రమేష్.. రాజీవ్ గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు.. హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ఈ కేసు విచారణ నేపథ్యంలో ‘ఆస్ఫోట’ పేరుతో ఓ సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కనుంది. రాజీవ్ గాంధీ కేసును విచారించిన సీబీఐ అధికారి కార్తికేయన్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు.

ఇటీవలే రానా.. దర్శకుడి ఆహ్వానం మేరకు బెంగళూరుకు వెళ్లి కథ విన్నాడు. కథ.. పాత్ర రెండూ నచ్చి వెంటనే అంగీకారం తెలిపాడట రానా. రాజీవ్ గాంధీ హత్యోదంతానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కోణాలున్నాయి. దీనిపై సినిమా తీస్తే కచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. మరి పాతికేళ్ల కిందటి పరిణామాల్ని ఈ సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.