ఈ డైరెక్టర్‌ పవన్‌కళ్యాణ్‌ని ఎలా భరించాడో?

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రానికి దర్శకుడు బాబీకి ఏమాత్రం ఫ్రీడమ్‌ ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. మూడు యూనిట్లు డివైడ్‌ చేసి ఒక్కో యూనిట్‌కి ఒక్కో దర్శకుడు చొప్పున ఎవరికి తోచింది వారు తీసేయడం వల్లే ఆ సినిమా అలా తయారైంది.

పవర్‌తో దర్శకుడిగా మార్కులు కొట్టేసిన బాబీ రెండవ చిత్రానికి అంతగా ఎందుకు కాంప్రమైజ్‌ అయ్యాడనేది ఎవరికీ అంతు చిక్కలేదు. ‘నేనే దర్శకత్వం వహించా, నేనే దర్శకుడిని’ అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అంత జరిగినా ఓర్చుకుని ఆ చిత్రాన్ని పూర్తి చేసిన బాబీ నిజానికి సెట్స్‌లో అంత తేలిగా కాంప్రమైజ్‌ అవడని అంటారు. పవర్‌ చిత్రానికి ముందుగా ఆర్థర్‌ ఏ విల్సన్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకుంటే, అతనితో పడక జయనన్‌ విన్సెంట్‌ని పెట్టుకున్నాడు.

అలాగే ఇప్పుడు ‘జై లవకుశ’ చిత్రానికి కూడా మురళీధరన్‌ని మార్చేసి చోటా కె. నాయుడుని తీసుకొచ్చాడు. మురళీధరన్‌ జాతీయ స్థాయిలో పేరున్న సినిమాటోగ్రాఫర్‌ అయినప్పటికీ అతనితో వచ్చిన ఈగో క్లాషెస్‌ వల్ల బాబీ వేరే సినిమాటోగ్రాఫర్‌ని పెట్టుకున్నాడు. ఇంత ఖరాఖండీగా వ్యవహరించే బాబీ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ విషయంలో మాత్రం ఎందుకంతగా రాజీ పడిపోయాడో అని మాట్లాడుకుంటున్నారు.

పవన్‌ వీరాభిమానినని చెప్పుకున్న బాబీ నిజంగానే అభిమాని కావడం వల్లే అదంతా భరించాడో లేక మధ్యలో సినిమా వదిలేస్తే తన భవిష్యత్తుకి సమస్య అవుతుందని ఊరుకున్నాడో కానీ జై లవకుశకి మాత్రం అంతా తను అనుకున్నట్టే జరిగేలా పూర్తి కమాండ్‌ తీసుకున్నాడు.