అప్పట్లో.. కాంబినేషన్లో మరో సినిమా

అన్ని మంచి సినిమాలూ ఆడేస్తాయనేమీ లేదు. కానీ గత వారం వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. మంచి వసూళ్లు కూడా సాధిస్తోంది. ఈ సినిమా అనేక రకాలుగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కుర్రాడిలా కనిపించే సాగర్.కె.చంద్ర ఇలాంటి కథను డీల్ చేయడం ఆశ్చర్యం.

చిన్నా చితకా పాత్రలు వేస్తూ వచ్చిన శ్రీవిష్ణు ఇంత వెయిట్ ఉన్న పాత్రను సమర్థంగా పోషించడం ఆశ్చర్యం.. శ్రీ విష్ణు మీద నమ్మకంతో అతడికి లీడ్ రోల్ ఇచ్చిన నారా రోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యం. వీళ్లందరి కాన్ఫిడెన్సుకి హ్యాట్సాఫ్ చెప్పాలి.

విశేషం ఏంటంటే.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని పని చేసిన ఈ చిత్ర బృందం.. ఇదే కాంబినేషన్లో ఇంకో సినిమా చేయడానికి కూడా స్క్రిప్టు తయారు చేసుకుందట. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కోసం వర్క్ చేస్తుండగా.. సమాంతరంగా ఈ టీమ్ అంతా కలిసి మరో స్క్రిప్టు రెడీ చేసినట్లు శ్రీవిష్ణు వెల్లడించాడు. ఆ స్క్రిప్టు ఇప్పటికే పూర్తి కావచ్చిందట.

‘అప్పట్లో ఒకడుండేవాడు’కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆ సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సినిమాను కూడా ‘ఆరన్ మీడియా వర్క్స్’ బేనర్ మీదే నిర్మించనున్నట్లు నారా రోహిత్ కూడా కన్ఫమ్ చేశాడు. ఐతే ఈ చిత్రానికి సాగర్.కె.చంద్రనే దర్శకత్వం వహిస్తాడా.. మరో దర్శకుడిని ఎంచుకుంటారా అన్నది ఇంకా తెలియలేదు.