సింగిల్‌ డేలో చిరంజీవి రికార్డ్‌ ఔట్‌!

‘బాహుబలి 2’ రిలీజ్‌కి దగ్గర పడడంతో మార్కెట్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మళ్లీ థియేటర్లన్నీ కళకళలాడిపోయే రోజులు వస్తాయంటూ సినీ విపణిలో ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు మార్కెట్లో వున్న సినిమాలు అంతగా ఆడడం లేదని కూడా ఎగ్జిబిటర్లు బెంగ పడడం లేదు. మరో మూడు వారాల్లో ఇక క్యాష్‌ లెక్కేసుకోవడం తప్ప మరో పని వుండదని సంబరంగా వున్నారు.

‘బాహుబలి 2’ చిత్రానికి థియేటర్ల దగ్గర జాతర వాతావరణం ఖాయమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాహుబలి సాధించిన రికార్డుల సమీపంలోకి కూడా ఇంతవరకు ఏ సినిమా వెళ్లలేదు. ఇప్పుడు బాహుబలి 2తో ఆ మొదటి సినిమా రికార్డులన్నీ పటాపంచలవుతాయని అంచనా వేస్తున్నారు. ఎంత వీక్‌ టాక్‌ వచ్చినప్పటికీ రికార్డులు గల్లంతవడం ఖాయమని, ఇక బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే ఆకాశమే హద్దని అంటున్నారు. మొదటి రోజే వంద కోట్లకి పైగా షేర్‌ వస్తుందని ట్రేడ్‌ వర్గాలంటున్నాయి.

మునుపటితో పోలిస్తే కింది సెంటర్ల నుంచి ఫిక్స్‌డ్‌ హైర్లు, షేర్‌ గ్యారెంటీలు బాగా పెరిగిపోయాయని, బాహుబలి సమయంలో ఈ రేంజ్‌లో లేవని, కేవలం ఆ ఫిక్స్‌డ్‌ హైర్లు వగైరా తీసుకుంటేనే తొలి రోజు రికార్డు వచ్చేస్తుందని, ఇక కలక్షన్లు కూడా కలిపితే దాని స్థాయి ఎంత వుంటుందో ఊహనలవి కాదని అంటున్నారు.

మొదటి రోజు షేర్‌తో నాన్‌ బాహుబలి రికార్డ్‌గా నిలిచిన ‘ఖైదీ నంబర్‌ 150’ రికార్డ్‌ బ్రేక్‌ అయిపోవడం ఖాయమని అంటున్నారంటే బాహుబలి 2 ఉధృతిని ఏ స్థాయిలో అంచనా వేస్తున్నారనేది అర్థం చేసుకోండిక.