ఉప ఎన్నిక‌ల్లో ఊపేసిన టీడీపీ

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ త‌న స‌త్తా మ‌రోమారు చాటుకుంది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో  విజయభేరి మోగించింది. ఎక్కువ చోట్ల తెదేపా అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో తెదేపా అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్‌ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థిపై ఆయన 150 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో జరిగిన ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైకాపాకు చెందిన వార్డు మెంబర్‌ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. తమ సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైకాపా.. ఇక్కడ గెలిచి వైకాపాకు చెక్‌ పెట్టాలని తెదేపా వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. చివరకు తెదేపా అభ్యర్థి గెలుపొందడంతో వైకాపా శ్రేణులు నిరాశ చెందాయి.

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో 38 డివిజన్‌లో తెదేపా అభ్యర్థి వసంత్‌కుమార్‌ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చిత్తూరు జిల్లా పలమనేరు 23వ వార్డులో టీడీపీ అభ్యర్థి మదన్‌మోహన్‌ 371 ఓట్లతో గెలుపొందారు. య‌లమంచిలి మున్సిపాలీటీ 16వ వార్డులో తెదేపా అభ్యర్థి వనం గీతా గ్రేస్‌ విజయం సాధించారు. మాచర్ల 15 వార్డులో వైకాపా అభ్యర్థిపై తెదేపా అభ్యర్థి అంకారావు 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 16 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రవికుమార్‌ గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు.

సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం 9వ వార్డులో టీడీపీ అభ్యర్థి శాంత 939 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాడిపత్రి 4వ వార్డులోనూ టీడీపీ అభ్యర్ధే గెలిచారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు రెండోవార్డులో టీడీపీ అభ్యర్థి నబి రసూల్ 399 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.కాగా, మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డులో వైకాపా అభ్యర్థి రమణయ్య గెలుపొందారు.