పెద్ద సినిమాలకి వణుకు పుట్టిస్తోన్న బాహుబలి

బాహుబలి వస్తుందంటే చిన్న సినిమాల కంటే హై బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలకే కంగారుగా వుంది. బాహుబలి 2 రిలీజ్‌ అవుతుందని తెలిసినా కానీ అదే టైమ్‌లో రావడానికి ‘బాబు బాగా బిజీ’, ‘వెంకటాపురం’ లాంటి చిన్న చిత్రాలు వెనుకాడడం లేదు. ఎందుకంటే ఈ చిత్రాలపై బాహుబలి ఇంపాక్ట్‌ తక్కువ. వీటినుంచి ప్రేక్షకులకి అంతగా అంచనాలు వుండవు కనుక బాహుబలితో వచ్చినా సమస్య వుండదని వారి నమ్మకం.

పైగా బాహుబలి రిలీజ్‌ వల్ల పెద్ద చిత్రాలేమీ రావు నుక థియేటర్లు దొరుకుతాయి. ఓవర్‌ఫ్లోస్‌ అన్నీ ఈ చిత్రాలకి కలిసి వస్తాయి. కానీ పెద్ద చిత్రాల పరిస్థితి అది కాదు. బాహుబలి చూసిన ప్రేక్షకులు అదే స్థాయి అవుట్‌పుట్‌, ఇంపాక్ట్‌ తర్వాత వచ్చిన పెద్ద చిత్రాల నుంచి ఆశించే అవకాశముంది.

బాహుబలి 1 సగం సినిమానే కనుక ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ ఏమీ లేదు. కానీ బాహుబలి 2 మాత్రం జనాన్ని వెంటాడుతుందని చిత్ర సభ్యులే అంటున్నారు. అదే జరిగితే ఆ తర్వాత వచ్చే పెద్ద చిత్రాలపై అంచనాలు తారాస్థాయిలో వుంటాయి. బాహుబలి స్థాయిలో వారికి సంతృప్తిని ఇవ్వని పక్షంలో వాటిని జనం తిరస్కరించే ప్రమాదం వుంటుంది. మగధీర తర్వాత వచ్చిన తర్వాత చాలా నెలల వరకు ఆ ఎఫెక్ట్‌ బాక్సాఫీస్‌పై కనిపించింది.

తర్వాత వచ్చిన చిత్రాల నుంచి హై స్టాండర్డ్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఆడియన్స్‌ వచ్చిన దానిని వచ్చినట్టే తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి రిపీట్‌ అయితే కష్టమవుతుందని, అంచేత బాహుబలి మేనియా తగ్గుముఖం పట్టేవరకు వేచి చూడడమే బెస్ట్‌ అని, కంగారు పడి అది రిలీజ్‌ అయిన నాలుగైదు వారాలకి తమ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం కంటే వీలయినంత వెనక్కి వెళ్లడమే మంచిదని చాలా మంది భావిస్తున్నట్టు అనిపిస్తోంది. మరి బాహుబలి 2 నిజంగా ఆ స్థాయిలో ప్రేక్షకులని ప్రభావితం చేయగలదా?