బన్నీకి బాహుబలి హెడ్డేక్‌

‘బాహుబలి 2’ రిలీజ్‌ డేట్‌ ఏప్రిల్‌ 28 అని అనౌన్స్‌ చేయడంతో ఆ చిత్రానికి ముందు, వెనకా ఒక రెండు వారాలయినా గ్యాప్‌ ఇవ్వాలని నిర్మాతలు ఫిక్స్‌ అయిపోయారు. భారీ చిత్రాల నిర్మాతలు కూడా ‘బాహుబలి’తో బాహాబాహీకి దిగడానికి ముందుకు రావడం లేదు.

అయితే ఈ చిత్రం ఖచ్చితంగా ఏప్రిల్‌ 28కి వస్తుందని అంటే, అందుకు అనుగుణంగా తమ సినిమాలు ప్లాన్‌ చేసుకునే వీలుంటుంది. కానీ గ్రాఫిక్స్‌తో ముడిపడ్డ ఈ చిత్రం ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తీరా బాహుబలి ఏప్రిల్‌ నెలాఖరులో వస్తుందని మే నెలలో రిలీజ్‌ ప్లాన్‌ చేసుకున్నాక, అప్పుడు ఈ చిత్రం ఆలస్యమైతే దాంతో పాటు తమ రిలీజ్‌ కూడా డిలే అవుతుంది.

ఎప్పుడూ ఏప్రిల్‌లో తన సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడే అల్లు అర్జున్‌ ఈసారి ఏప్రిల్‌ని బాహుబలికే వదిలేస్తున్నాడు. మే మూడవ వారంలో ‘దువ్వాడ జగన్నాధమ్‌’ విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకవేళ బాహుబలి రిలీజ్‌ ఏ కారణం చేత అయినా లేట్‌ అయినట్టయితే ఏప్రిల్‌ 21నే ‘డిజె’ రిలీజ్‌ చేసేద్దామని కూడా అనుకుంటున్నారు.

అందుకోసం ఎర్లీగా షూటింగ్‌ ఫినిష్‌ చేయడానికి కాస్త టైట్‌ షెడ్యూల్‌ కూడా వేసుకున్నారట. కాకపోతే ఇదంతా ‘ఒకవేళ బాహుబలి లేటయితే’ అన్న దానిమీదే తప్ప, అది టైమ్‌కి వచ్చేస్తే ‘డిజె’ కనీసం నెల రోజులు ఎదురుచూడక మానదు. ఒక్క బన్నీకి అనే కాదు ఏప్రిల్‌/మేలో రిలీజ్‌ ప్లాన్‌ చేసుకున్న సినిమాలన్నిటిదీ ఇదే వరస.