ఎంత పని చేసావయ్యా బాలయ్యా!

చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నారంటే ఏమంత సెన్సేషన్‌ కాలేదు. రాజకీయాల్లో విఫలమైన చిరంజీవి తిరిగొస్తున్నాడంటే అభిమానుల్లోను కొందరు ఎక్సయిట్‌ అవలేదు. అందులోను రీఎంట్రీకి రీమేక్‌ సినిమా ఎంచుకోవడంతో ఖైదీ నంబర్‌ 150పై అంచనాలు ఏర్పడలేదు. అభిమానులు సైతం ఈ చిత్రం విషయంలో ఎక్సయిట్‌ కాకపోవడంతో దీనికి క్రేజ్‌ రావడం ఇంపాజిబుల్‌ అనుకున్నారు.

అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్‌ చేయడం, అదే టైమ్‌లో బాలకృష్ణ సినిమా కూడా విడుదల అవుతూ ఉండడంతో అభిమానుల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వారందరికీ గతం గుర్తొచ్చింది. బాలకృష్ణ సినిమాపై చిరంజీవి సినిమా విడుదలవుతోందంటే, అది తమకి పరువు ప్రతిష్టల సమస్య కావడంతో అభిమానులు అందరినుంచీ ఈ చిత్రానికి పూర్తి మద్దతు లభించింది.

ఇక ఇదిలావుంటే, ఖైదీ నంబర్‌ 150 ఎప్పుడు రిలీజ్‌ అయితే ఆ రోజే తమ సినిమా విడుదల చేస్తామంటూ చాలా కాలం పాటు తెర వెనుక వార్‌ నడిచింది. ఇది ఫాన్స్‌కి తెలియడంతో ఈ క్లాష్‌ని వారు మరింత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ఇక అన్నిటికంటే ఎక్కువగా ఖైదీ నంబర్‌ 150 చిత్రం వేడుక నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండడంతో, ఇది వారి కుట్రేననే అభిప్రాయం బలపడడంతో చిరు చిత్రానికి సింపతీ కూడా తోడయింది.

అసలు క్రేజ్‌ ఉంటుందో లేదో, ఫాన్స్‌ అయినా పట్టించుకుంటారో లేదో అనుకున్న చిత్రం కాస్తా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రంగా అవతరించింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ట్రెండ్‌ చూసినా, బిజినెస్‌ స్టాట్స్‌ చూసినా తొలి రోజు రికార్డు చిరంజీవి సొంతం కావడం లాంఛనమే అని తేలిపోయింది.