ఊది పారేసిన బాబు…జగన్ ఏం చేస్తారో…?

అందుకే చంద్రబాబుని రాజకీయ గండర గండడు అని ఒకటికి పదిసార్లు ఎవరైనా అంటారు. ఆయనకు ఎపుడేమి మాట్లాడాలో తెలుసు. అన్నింటికీ మించి జనాల పల్స్ తెలుసు. ఆయన ఏకంగా పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏపీ అంతటా లెక్కలేనన్ని సార్లు తిరిగారు. జనాలు ఏమి కోరుకుంటున్నారో. వారికి ఏం కావాలో బాబుకు బాగా తెలుసు అని తమ్ముళ్ళు ఎపుడూ చెబుతూ ఉంటారు.

చివరికి అదే నిజం అవుతోంది కూడా. ఏపీలో చూస్తే మూడు రాజధానులు ఆత్మగౌరవాలు అంటూ సెంటిమెంట్ ని బాగా పూసి రెచ్చగొట్టాలని వైసీపీ చూసింది. రీసెంట్ గా జగన్ విశాఖ టూర్ లో కూడా మూడు రాజధానుల గురించి ప్రస్థావించారు. కానీ చిత్రమేంటి అంటే విశాఖ రాజధాని సెంటిమెంట్ అయితే పెద్దగా లేదు. పైగా విశాఖ జనాలకు ఆ ఊసే అసలు పట్టడంలేదు.

మరి అధికార పార్టీ ఏ సర్వేలను ఆధారం చేసుకుని అక్కడ సెంటిమెంట్ ఉందని భావించిందో తెలియదు. ఇక్కడ చాలా విషయాలను చూడాలి. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విశాఖ రాజధాని అని 2020 జనవరిలో ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన వెంటనే విశాఖ సాగరతీరం నిజంగా ఉప్పొంగాలి. తమ ప్రాంతానికి రాజసం వచ్చిందని సంతోషించాలి. కానీ అలా ఏమీ జరగలేదు.

అదే టైమ్ లో అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ ఊపందుకుని ఏళ్ళ తరబడి ఆందోళన జరుగుతున్నపుడైనా విశాఖలో ఆ ఉత్సాహం ఉంటే ఉబికి బయటకు రావాలి. కానీ విశాఖ వాసులు నాడు ఏమన్నారు అంటే అవును కదా పాపం కదా. అమరావతిని రాజధానిగా మొదట ప్రకటించి తరువాత మూడు అనడం తప్పు కదా అని వారికే అనుకూలంగా మాట్లాడరు. ఇది మరో సంకేతం.

ఇక జీవీఎంసీ ఎన్నికలు 2021లో జరిగాయి. నాటికి మూడు రాజధానుల చట్టం అలాగే ఉంది. విశాఖ రాజధాని మీద మంత్రుల ప్రకటనలు గట్టిగా వస్తూనే ఉన్నాయి. ఆ టైమ్ లో 98 వార్డులకు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి వచ్చింది బొటాబొటీ మెజారిటీ. జస్ట్ 56 సీట్లు మాత్రమే. అదే టైమ్ లో విశాఖ రాజధాని వద్దు అంటున్న టీడీపీకి 30 సీట్లకు పైగా వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే విశాఖ రాజధాని మీద మరీ అంత ప్రేమ ఉంటే వైసీపీ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం 80 కి పైగా సీట్లు రావాలి కదా.

అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రజా తీర్పు ఎపుడూ విశాఖ రాజధాని కావాలని మాత్రం రాలేదు. అయితే అసలు రాజధాని వద్దా అంటే ఎందుకు వద్దు. ఇస్తే రాజధానిని చేస్తే చేయనీయండి అనే బాపతు కూడా ఉన్నారు. అయితే వారి సంఖ్య తక్కువ. పైగా వారంతా రాసిపెట్టి ఉంటే విశాఖ రాజధాని అవుతుంది తప్ప అరచి గీ పెడితే కాదు అనుకునే వారు.

అంటే మెజారిటీ సెక్షన్లకు మాత్రం విశాఖ రాజధాని మీద మక్కువ లేదు అని తేలిపోయింది. సరిగ్గా ఈ విషయాలే టీడీపీ అధినాయకత్వం దగ్గర ఉండడంతో బాబు చాలా డేరింగ్ గా అది కూడా విశాఖ నడిబొడ్డునే రాజధాని విశాఖకు వద్దు అని అనగలిగారు అంటున్నారు. దాని మీద వైసీపీ జనాలకు ఎంత రెచ్చగొట్టినా వారి నుంచి వచ్చేది కూడా లేదు అని తెలుసు కనుకనే సెంటిమెంటూ లేదు ఆయింట్మెంటూ లేదని ఉఫ్ అని ఒక్క మాటతో వైసీపీ రాజధాని భ్రాంతిని అలా ఊదేశారు.

మరి వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులూ సెంటిమెంట్లూ ఆత్మగౌరవాలు అని చెబుతూ జనాల్లోకి వెళ్ళాలన్నది వైసీపీ వారి మాస్టర్ ప్లాన్ అంటున్నారు. దానిని జగన్ ఈ మధ్యనే బయటపెట్టుకున్నారు. ఇలా జగన్ నోట తొలి మాట బయటకు రావడంతోనే అలా బాబు విశాఖ వచ్చి ఊదేశారు. మరి మూడు ప్రాంతాల్లో గెలుపు కోసం వైసీపీ వద్ద ఉన్న కొత్త ఆయుధం ఏంటి సెంటిమెంట్ పండని చోట కొత్త వ్యూహాలు ఏంటి అన్నది కూడా ఇపుడు ఆలోచించాలి. మొత్తానికి బాబా మజాకా అనిపించేశారు.