దంగల్‌ తో చిండియాకు ప్రాణం పోయాలి

అమీర్‌ఖాన్‌ దంగల్‌ సినిమా చైనాలో సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంగ్లీషేతర  సిని మాల్లో అతి భారీగా వసూళ్లు సాధించిన అయిదవ చలనచిత్రంగా రికార్డులు నెలకొల్పింది. ఇంటర్నేషనల్ గా 30 కోట్ల డాలర్ల మార్క్‌ను అధిగమించింది.  ఇంతకీ అమీర్ ఖాన్ నటించిన ఆ సినిమా చైనావాళ్లకు ఎందుకంత నచ్చిందో తెలుసా….?  సింపుల్… ఈ సినిమా కథ చైనా ప్రజల జీవితానికి అత్యంత దగ్గరగా ఉండడమే.  ఇండియాలో ఉన్నట్లే చైనాలోనూ అన్ని రకాల అంతరాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

జెండర్ బయాస్… పట్టణాలు, గ్రామాల మధ్య ఎంతో తేడా… పేద, ధనిక భేదాలు వంటివన్నీ చైనాలోనూ చాలా కామన్.  ఈ సినిమాల్లో అవన్నీ కనిపిస్తాయి… అందుకే చైనావాళ్లు ఈ సినిమాను అంతగా నచ్చేశారు. అంతేకాదు… ఈ సినిమాపై చైనాలో ఆర్థికవేత్తలు కూడా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. దీనిపై చైనా మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అన్ని రంగాల్లో చైనా, భారత్ ల మైత్రి దంగల్ సినిమాను స్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు.

ఒక గ్రామీణ యువతి అంతర్జాతీయ కుస్తీ యోధురాలిగా ఎలా ఎదిగింది అన్నది దంగల్‌ లో చూపించారు.  సహజంగానే చైనాలో క్రీడల పట్ల భారత్‌లో కంటే ఆసక్తి ఎక్కువ.  అక్కడి గ్రామ స్థాయిల్లోనూ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. సరిగ్గా ఇదే కథాంశం తీసిన దంగల్‌ చైనీయుల మనస్సులన కొల్లగొట్టేసింది. ఇప్పుడదే స్ఫూర్తి మిగతా రంగాల్లో కూడా ప్రదర్శించాలని చైనా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి. మళ్లి చిండియాకు(చైనా-ఇండియా) ప్రాణం పోయాలని, ఇరుదేశాలు పాశ్చాత్య సమాజానికి ధీటుగా ఎదగాలని, ఇందుకు ఒకే వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాయి.

చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ మీదుగా నిర్మిస్తున్న వాణిజ్య జాతీయ రహదారి పట్ల భారత్‌కు తీవ్ర అభ్యంతరాలతో ఇటీవల జరిగిన సదస్సుకు హాజరుకాని విషయం తెలిసిందే.  అయితే, దీనిపై చైనా ఆచితూచి స్పందిస్తోంది. ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ, సమాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కటే కాబట్టి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటోంది.

అంతర్గతంగా ఇరుదేశాలు అభివృద్ధి చెందాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని రంగాల్లోనూ సహకరించుకుంటే తప్ప సాధ్యం కాదని అక్కడి సామాజిక, ఆర్థిక విశ్లేషకులు కూడా అంటున్నారు.  ఇటీవల జరిగిన షాంఘై సహకారం సంస్థ సదస్సులోనూ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా  దంగల్‌ సినిమా చూశానని, నచ్చిందని చెప్పడం తెలిసిందే. దీంతో.. చైనా ప్రజల్లో భారత్ పట్ల సానుకూలత ఏర్పడుతోంది. మొత్తానికి అమీర్ ఖాన్ రెండు దేశాలనూ దగ్గర చేస్తాడేమో చూడాలి.