మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు మృతి చెందిన విషయం తెలసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఆయనతోపాటు రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి.
అయితే.. ఈ ప్రమాదంలో అక్కడ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఉమాపతిరావు మృతదేహాన్ని దోమకొండలోని వెంకట్ భవన్ లో ఉంచారు. 12గంటలకు అంత్యక్రియలు జరిపే సమయంలో వీరిపై ఈ దాడి జరిగింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనను వేరే గదిలోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ దాడిలో కామినేని కుటుంబసభ్యులకు కొందరు దాడికి గురయ్యారని తెలుస్తోంది.
దాదాపు 30 తేనేటీగలు ఉన్న కుప్ప దాడి చేయడంతో ప్రమాదం తప్పిందని.. పెద్ద తేనెటీగల కుప్ప దాడి చేసుంటే భారీ ప్రమాదమే జరిగుండేదని తెలుస్తోంది. అంత్యక్రియల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ హాజరయ్యారు. అక్కడున్న వారినందరినీ తేనెటీగలు కాసేపు ఉక్కిరిబబిక్కిరి చేశాయి. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది.