చరణ్‌ని పూర్తిగా వదిలేసిన చిరంజీవి

ఆరెంజ్‌’ పరాజయం తర్వాత చరణ్‌ డిఫెన్స్‌లో పడ్డప్పుడు అతని కెరియర్‌ని మౌల్డ్‌ చేసే బాధ్యత చిరంజీవి తీసుకున్నాడు. తనయుడిని మాస్‌ హీరోగా నిలబెట్టేందుకు చిరంజీవి తనకి తెలిసిన ఫార్ములా వాడాడు. వరుసపెట్టి చరణ్‌తో మాస్‌ సినిమాలు చేయించడం వల్ల అతనికి హిట్స్‌ అయితే వచ్చాయి కానీ నేటి తరం ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. తను చేసిన తప్పు రియలైజ్‌ అయ్యేసరికి పోటీలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ తనకంటే చాలా ముందుకి వెళ్లిపోయారు. ఇక రూటు మార్చక తప్పదని ‘తని ఒరువన్‌’ రీమేక్‌ చేయడానికి చరణ్‌ సంకల్పించాడు. అయితే ఆ చిత్రం చూసిన చిరంజీవికి అది అంతగా నచ్చలేదట. విలన్‌ డామినేషన్‌ ఎక్కువైందని, మాస్‌ ఇష్టపడరని చెప్పాడట. అయితే చరణ్‌ తన గట్‌ ఫీలింగ్‌తో రీమేక్‌ చేయడానికే సిద్ధపడ్డాడు. తన సొంతంగానే ఆ చిత్రం నిర్మించాలని అనుకున్న చరణ్‌ని వారించి, అల్లు అరవింద్‌ని నిర్మాతగా పెట్టింది కూడా చిరంజీవేనట.

మెగా ఫ్యామిలీలో నిన్నటి తరం వాళ్లు ఎవరూ నమ్మని ‘ధృవ’తో చరణ్‌ తానే కరెక్ట్‌ అని నిరూపించుకున్నాడు. దీంతో చరణ్‌ జడ్జిమెంట్‌పై గురి కుదిరిన చిరంజీవి ఇక అతని సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదట. గతంలో చరణ్‌ సినిమాల ఎడిటింగ్‌ బాధ్యతని చిరు దగ్గరుండి చూసుకునేవాడు. కానీ ధృవ ఫైనల్‌ కట్‌ డైరెక్టుగా చూసాడు. సుకుమార్‌ సినిమా కథ అయితే చిరంజీవి కనీసం వినలేదని, పూర్తిగా చరణ్‌ నిర్ణయానికి వదిలేసారని సమాచారం. సుకుమార్‌పై ఎలాంటి రిస్ట్రిక్షన్స్‌ పెట్టకుండా తనకి నచ్చిన కథని, తను నమ్మిన విధంగా తీయమని, రిజల్ట్‌తో పని లేదని చరణ్‌ తేల్చి చెప్పాడని టాక్‌. ఇంతటి రివల్యూషనరీ డెసిషన్స్‌తో చరణ్‌ కెరియర్‌ ఎలా షేప్‌అప్‌ అవుతుందో చూడాలిక.