శర్వానంద్‌కి రెండున్నర కోట్లు మిగిలాయి!

‘శతమానం భవతి’ చిత్రానికి శర్వానంద్‌ పారితోషికం తీసుకోలేదట. దిల్‌ రాజుతో బేరమంటేనే చాలా తక్కువ గిట్టుబాటు అవుతుంది కనుక శర్వానంద్‌ తెలివిగా ఓవర్సీస్‌ రైట్స్‌ తనకి ఇచ్చేయమని అడిగాడట. ఓవర్సీస్‌ మార్కెట్‌ మీద అంత గ్రిప్‌ లేని దిల్‌ రాజు అక్కడ్నుంచి ఎంత వస్తుందనేది అంచనా వేయలేక రెమ్యూనరేషన్‌ బదులు ఓవర్సీస్‌ రైట్స్‌ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. శర్వానంద్‌ తన గత సినిమాల ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ‘శతమానం భవతి’ చిత్రాన్ని రెండున్నర కోట్లకి బిజినెస్‌ చేసుకున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే నాలుగు లక్షల డాలర్లకి పైగా ఆర్జించి, బ్రేక్‌ ఈవెన్‌ దిశగా దూసుకెళుతోంది. కొన్న వాళ్లకి కాస్తో కూస్తో లాభాలు రావడం కూడా ఖాయంగా కనిపిస్తోంది కనుక శర్వానంద్‌ లెక్క తప్పలేదు.

ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగా విడుదల చేయడంలోను శర్వానంద్‌ ప్రోద్బలం వుందని టాక్‌. ఇది ఎన్నారైలకి కనక్ట్‌ అయ్యే కథ కనుక ముందుగా అక్కడ రిలీజ్‌ చేయాలని, అదీ కాక ఇండియాలో శనివారం రిలీజ్‌ అంటే, ఓవర్సీస్‌లో వీకెండ్‌ మిస్‌ అయిపోతామని దిల్‌ రాజుతో మంతనాలు సాగించి తన మాట నెగ్గించుకున్నాడట. ఈ ఏడాది మొత్తంలో ఒక్కటే సినిమా చేసిన శర్వానంద్‌ దాని ద్వారా మాగ్జిమం రాబట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. గతంలో నిర్మాతగా ట్రై చేసి చేతులు కాల్చుకున్న శర్వాలోని ఈ బిజినెస్‌ తెలివితేటలు చూస్తుంటే, త్వరలోనే అతడి ప్రొడక్షన్‌ హౌస్‌ రీలాంఛ్‌ అయినా ఆశ్చర్యం లేదు.