ఇదేనా సంస్కారం? యండమూరికి చిరు సూటి ప్రశ్న

‘వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతున్న వ్యక్తి ఒకరిని పొగడడానికి మరొకర్ని కించ పరుస్తూ మాట్లాడాలా? ప్రతి ఒక్కరిలోను లోపాలుంటాయి, వంకలుంటాయి. నాలోను లోపాలున్నాయి. నేను కొంతమందికి స్ఫూర్తి కాలేదా? నా గురించి మాట్లాడేటపుడు నా లోపాల గురించే మాట్లాడతారా? మంచి గురించి మాట్లాడరా?” అంటూ యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఘాటుగానే స్పందించారు.

”స్త్రీల గురించి మాట్లాడే సమయంలో సభా మర్యాద పాటిస్తూ బహువచనంతో సంబోధిస్తాం. అలాంటిది నా భార్య సురేఖని ఏకవచనంతో సంబోధించడం ఏమిటి? ఇంట్లో మనిషిలాగా అలా మాట్లాడతాడేంటి అని మావాళ్లు కూడా అనుకున్నారు. ఇదేం సంస్కారం? వ్యక్తిత్వ వికాసం గురించి పాఠాలు చెప్పేవాళ్లు పర స్త్రీల గురించి అలా మాట్లాడడమేంటి?” అని చిరంజీవి మాట్లాడుతుంటే రాంగోపాల్వర్మ విషయంలో ఎలా వున్నా యండమూరి వీరేంద్రనాధ్ వ్యవహారం ఆయనకి అస్సలు నచ్చలేదనే సంగతి అర్థమైంది.

అయితే తనపై వచ్చే ప్రతి విమర్శకీ రియాక్ట్ కాలేనని, అది తన స్థాయికి తగదని చిరంజీవి అన్నారు. ఇలాంటివి వచ్చినపుడు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ వెంటనే కొట్టి పారేస్తానని, కానీ నాగబాబు అలా కాదని, తను సెన్సిటివ్ నుక ఏదనిపిస్తే అది మాట్లాడేస్తాడని చెప్పారు. నాగబాబు అగ్రెసివ్గా మాట్లాడి వుండొచ్చు కానీ అతను స్పందించడం తప్పంటే ఒప్పుకోనని, ఇంకా ట్వీట్లేస్తోన్న వర్మకి తమ వైపు నుంచి ఏ సమాధానం రాదని చిరంజీవి స్పష్టం చేసారు.