వావ్: మంచు కుర్రాడికి మెగాస్టార్ వాయిస్

మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితుల్లాగే కనిపిస్తారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. మోహన్ బాబు కొన్ని సందర్భాల్లో చిరంజీవికి చురకలంటించే ప్రయత్నాలు చేశారు.

ఐతే అదంతా గతం. ఈ మధ్య ఇద్దరూ సఖ్యతతోనే మెలుగుతున్నారు. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కొత్త సినిమా ‘గుంటూరోడు’ కోసం చిరంజీవి మాట సాయం చేయడానికి కూడా ఒప్పుకోవడం విశేషం. రెండేళ్ల కిందట ‘రుద్రమదేవి’ సినిమాకు.. ఈ మధ్యే ‘ఘాజీ’ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలకూ మంచి ఫలితం దక్కడంతో చిరు వాయిస్ ఓవర్ అన్నది హిట్టు సెంటిమెంటుగా మారింది.

‘గుంటూరోడు’ సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా ఈ రోజే చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. మెగాస్టార్‌కు ఈ విషయమై థ్యాంక్స్ చెబుతూ.. పోస్టర్లు కూడా వదిలింది. ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్న మనోజ్ గురించి సినిమాలో చిరు ఏమని పరిచయం చేస్తాడో చూడాలి. నెల రోజుల నుంచి మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ‘గుంటూరోడు’ ఈ మధ్యే మార్చి 3కు ఫిక్సయింది. ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేస్తున్నారు ఇప్పట్నుంచే. చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడమన్నది ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యేదే. ‘నా రాకుమారుడు’ ఫేమ్ ఎస్కే సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించింది.