చిరును పొగుడుతుంటే ఆమె గాల్లో తేలిపోతోంది

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో కథాకథనాల కంటే కూడా చిరు లుక్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. చిరు దశాబ్దం కిందట ‘శంకర్ దాదా జిందాబాద్’లో నటించినప్పటి కంటే ఇప్పుడే అందంగా ఉన్నాడని.. ఆయన లుక్ అదుర్స్ అని అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్స్ వినిపించాయి.

ఆయన స్టైలింగ్ విషయంలోనూ అందరూ ప్రశంసలు కురిపించారు. చిరు చాలా ట్రెండీగా కనిపించాడని కితాబిచ్చారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువ సంతోషిస్తున్నది చిరంజీవి కూతురు సుస్మితనే. ఎందుకంటే ‘ఖైదీ నెంబర్ 150’కి స్టైలిస్ట్ ఆమే. ఈ సినిమా కోసం చిరు లుక్ పరంగా ఎంత కేర్ తీసుకున్నది ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరించింది.

‘‘నాన్నగారు అంత అందంగా కనిపించడంలో నా కృషి కంటే ఆయన పాత్ర చాలా ఉంది. ముందు ఆయన సినిమా కోసం తన ఫిజిక్ ఎంతో మార్చుకున్నారు. ఆయనకు మంచి టేస్టుంది. తనకు ఏది సూటవుతుందో బాగా తెలుసు. నేను ఆయనతో దశాబ్దం నుంచి పని చేస్తున్నా. ఆయన ఇష్టాఇష్టాలేంటో నాకు బాగా తెలుసు. ‘ఖైదీ నెంబర్ 150’ మొదలవడానికి ముందు నేను.. చరణ్ కలిసి చర్చించుకున్నాం. నాన్నను మరీ కుర్రాడిలా చూపిస్తే బాగోదనుకున్నాం.

కాస్ట్యూమ్స్ ట్రెండీగా ఉండాలి కానీ.. ఆయన వయసును మరీ తగ్గించి చూపేలా ఉండకూడదని.. పాత్రకు తగ్గట్లుగా ఉండాలని అనుకున్నాం. కత్తి శ్రీను పాత్ర మాస్‌గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లే ఔట్ ఫిట్స్ తయారు చేయించాం. అలాగే శంకర్ పాత్రకు తగ్గట్లుగా దుస్తులు సమకూర్చాం. ఇప్పుడు నాన్న గారి లుక్.. మేకోవర్ విషయంలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’’ అని సుస్మిత తెలిపింది.