చిరు ఆశ.. అతనితో నటించాలని

ఐదేళ్ల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి పాల్గొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా చిరు మళ్లీ సినిమాల్లోకి రావాల్సిందేనని గట్టిగా చెప్పాడు అమితాబ్. చిరు సినిమా చేస్తే అందులో తాను గెస్ట్ రోల్ కూడా చేస్తానని కూడా అన్నాడు అమితాబ్.

ఐతే బిగ్-బి మాట వరసకు అలా అన్నప్పటికీ చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నాడట. తన రీఎంట్రీ మూవీలో అమితాబ్‌తో క్యామియో రోల్ చేయించాలని ఫిక్సయ్యాడట. ‘ఖైదీ నెంబర్ 150’ను తన రీఎంట్రీ మూవీగా అనుకున్నాక కూడా అమితాబ్‌తో క్యామియో చేయించే విషయమై సీరియస్‌గానే ఉన్నాడట చిరు. ఐతే ఈ సినిమా స్క్రిప్టు చూశాక.. ఇందులో అమితాబ్‌ను పెట్టడం కుదరదని చిరు భావించాడట. అమితాబ్ స్థాయికి తగ్గ రోల్‌కు ఇందులో అవకాశం లేకపోవడంతో ఆయన్ని అడక్కుండానే క్యామియో చేయించే ఆలోచనను మానుకున్నట్లు చిరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఐతే చిరు ఆలోచన మొగ్గలోనే అంతమైపోగా.. మరో స్టార్ హీరో బాలయ్య ఇప్పుడు అమితాబ్‌ కోసం పట్టుబట్టి కూర్చున్నాడు. తన 101వ సినిమాగా చేయాలనుకున్న ‘రైతు’లో అమితాబ్‌తో క్యామియో చేయించే విషయంలో బాలయ్య చాలా పట్టుదలతో ఉన్నాడు. ఈ పాత్రను అమితాబ్ ఒప్పుకుంటే సినిమా ఉంటుందని.. లేదంటే లేదని స్పష్టం చేశాడు. మరి అమితాబ్ ఏమంటాడో చూడాలి.