‘బాహుబలి-2’పై ఊహించని వివాదం

పెద్ద సినిమాల వెనుకే వివాదాలు కూడా తరుముకొస్తుంటాయి. రాజమౌళి సినిమాలు రిలీజైనపుడల్లా ఏదో ఒక వివాదం తలెత్తడం మామూలే. అందులో కొన్ని వివాదాలు మరీ చిత్రంగా ఉంటాయి. ‘మగధీర’ రిలీజైనపుడు ఆ సినిమాలో ఒకచోట లాయర్‌ను క్రూరంగా చంపే సీన్ ఉందని.. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ లాయర్లు ఆందోళన చేపట్టడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు సంబంధించి తలెత్తిన వివాదం చూస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం. ఈ సినిమాలో ఒక చోట ‘కటిక చీకటి’ అనే పదం వాడారట. దాని మీద వివాదం తలెత్తడం విశేషం.

కటిక చీకటి అని వాడటం అంటే ఆరె కటికెల కులస్థుల మనోభావాల్ని కించపరచడమే అంటూ ఆరెకటిక పోరాట సమితి తెలంగాణ అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ అన్నాడు. ఆయన దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాహుబలి దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

కటిక చీకటి అనే పదబంధాన్ని వాడటం తమ మనోభావాల్ని దెబ్బ తీయడమే అని.. ఏదో ఒక కులాన్ని కించపరిచేలా డైలాగ్స్ ఉండకూడదన్న సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించడమే అని.. ఆ పదాన్ని తొలగించకపోతే దర్శకుడు రాజమౌళి.. నిర్మాతల ఇళ్లను ముట్టడిస్తామని.. అప్పటికీ మార్పు రాకపోతే థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని సుధాకర్ హెచ్చరించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.