సైలెంట్గా నరుక్కొస్తున్న రాజు

సంక్రాంతి ఫోకస్ మొత్తం ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మీదే వుంది. మరో సినిమా కూడా దీంతో పాటు రిలీజ్ అవుతోందని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ దిల్ రాజు చాలా స్ట్రాటిజికల్గా ఈ చిత్రాన్ని ఈ రెండిటి మధ్య రిలీజ్ చేస్తున్నాడు. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలెప్పుడూ బాగా ఆడతాయని చరిత్ర చెబుతోంది. పైగా ఖైదీ మాస్ సినిమా అయితే, శాతకర్ణి చారిత్రిక చిత్రం.

ఈ రెండు జోనర్స్తో శతమానంకి క్లాష్ వుండదు కనుక దీని ఆడియన్స్ దీనకుంటారనేది దిల్ రాజు నమ్మకం. అందుకే సైలెంట్గా తనకి కావాల్సిన థియేటర్లు ముందే బుక్ చేసేసుకున్నాడు. కొన్ని చోట్ల శాతకర్ణికి అయినా సరిపడా థియేటర్లు లేవు కానీ శతమానంకి మాత్రం ఎక్కడా లోటు లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, ముందే థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకున్న దిల్ రాజు తన సినిమా గురించి ఎలాంటి హంగామా కూడా చేయడం లేదు. ఇప్పుడెంత చేసినా కానీ ఖైదీ వర్సెస్ శాతకర్ణి హోరులో అది పోతుంది కనుక ప్రమోషన్స్ అన్నీ ఆఫ్టర్ రిలీజ్ ప్లాన్ చేసి పెట్టుకున్నాడట.

శతమానం చిత్రానికి పది కోట్లు వస్తే హిట్ కింద లెక్కేసుకోవచ్చు. అది ఆడుతూ పాడుతూ అయినా సాధించేసే అమౌంట్ కనుక దిల్ రాజు ఏమాత్రం చింత పడడం లేదు. శతమానం భవతి ఫ్యామిలీస్కి కనక్ట్ అయితే కనీసం నాలుగైదు వారాల పాటు రన్ వుంటుందని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రెండు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమాని ఎలా విడుదల చేయాలో, ఏ విధంగా ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలో చిన్న నిర్మాతలకి దిల్ రాజు ఈ చిత్రంతో ఒక పాఠం చెబుతున్నాడు. ఎంతైనా రాజుగారి బుర్రే బుర్ర.