పవన్ చుట్టూ బిల్డప్ ఎక్కువైందంటున్న డైరెక్టర్

పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో ఉన్నప్పటితో పోలిస్తే.. ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్నాడని.. ఆయన చుట్టూ ఒక కోటరీ లాంటిది తయారైందని అంటున్నాడు అతడితో ‘తమ్ముడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అరుణ్ ప్రసాద్. ఇండస్ట్రీలో పవన్ 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో అరుణ్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అప్పటికి ఇప్పటికి పవన్‌లో వచ్చిన మార్పుల గురించి అరుణ్ మాట్లాడుతూ.. ‘‘తమ్ముడు సినిమా చేసే సమయంలో పవన్ కళ్యాణ్ అందరితో చాలా క్లోజ్‌గా ఉండే వాడు. మేం కింద కూర్చుంటే ఆయన కూడా కింద కూర్చునే వాడు. అసిస్టెంట్ డైరెక్టర్లందరూ పవన్‌ను.. నువ్వు నువ్వు అని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయనతో మామూలుగా మాట్లాడే అవకాశం కనిపించడం లేదు. అందరూ ఆయనకు అర కిలోమీటర్ దూరంలో ఉండి.. బాబూ బాబూ అని మాట్లాడుతున్నట్లుగా ఉంది. నాకు తెలిసి పవన్ వ్యక్తిగతంగా ఒకప్పటిలాగే ఉంటాడనుకుంటున్నా. కానీ ఆయన చుట్టూ ఉన్న సెటప్ మారినట్లుంది. వాళ్లందరూ ఒక బిల్డప్ క్రియేట్ చేసినట్లుంది’’ అని అరుణ్ ప్రసాద్ అన్నాడు.

వ్యక్తిగతంగా పవన్ చాలా బిడియం ఉన్న వ్యక్తి అని.. తనకు తోడుగా చేయి పట్టుకుని ఎవరైనా తీసుకొస్తే తప్ప సెట్లోకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడని అరుణ్ తెలిపాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అస్సలు సరిపోడని.. వ్యక్తిగతంగా తనకు పవన్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని.. ఇప్పటి రాజకీయాల్లో పవన్ లాగా ఉంటే చాలా కష్టమని అన్నాడు అరుణ్ ప్రసాద్.